calender_icon.png 19 October, 2024 | 2:48 AM

ఆమెను వెంటాడుతున్న అనారోగ్యం

19-10-2024 12:28:29 AM

  1. మారుతున్న జీవన శైలితో రోగాలబారిన పడుతున్న మహిళలు
  2. క్యాన్సర్, రక్తహీనత, థైరాయిడ్ వంటివి అధికం 
  3. అవగాహన అవసరం అంటున్న వైద్యులు

వికారాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ప్రస్తుత జీవన శైలిలో మార్పు రావడం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తదితర సమస్యల కారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా రోగాలబారిన పడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది మహిళా దినత్సోవం సందర్భంగా రాష్ట్రంలో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్.. ప్రత్యేకంగా మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిం ది.

ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో మూడు, రెండో విడతలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 8 కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 30,078 మందికి 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పలురకాల వ్యాధులు ఉన్నట్లు ప్రాథమిక నిర్థారణతో తేలింది. 14,619 మందికి మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. 

చాపకింద నీరుగా క్యాన్సర్ భూతం

మహిళల్లో ప్రధానంగా క్యాన్సర్ భూతం చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది మహిళా ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల్లో.. 182 మందికి రొమ్ము క్యాన్సర్, 63 మందికి నోటి క్యాన్సర్, 48 మందికి అంతర్గత అవయవాల్లో క్యాన్సర్ లక్షణాలు కన్పించడంతో వారిని జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేశారు.

అలాగే వైద్య పరీక్షలు నిర్వహించుకున్న మహిళల్లో 30 శాతం మందికి రక్త హీనత సమస్య ఉందని.. మరో 5 శాతం మంది తీవ్ర రక్త హీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇవే కాకుండా 746 మంది మహిళల్లో తీవ్ర కాల్షియం లోపం ఉన్నట్లు గుర్తించారు. వీరిని కూడా జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరితో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న 874 మందికి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 

జీవన శైలే కారణం

జీవన శైలిలో మార్పు రావడంతోనే మహిళలు ఎక్కువగా రోగాలబారిని పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనలతో ఎక్కువమంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు.

గ్రామీణ ప్రాంత మహిళల్లో ఎక్కువగా రక్తహీనత, విటమిన్ లోపం వంటి సమస్యలు ఉన్నట్లు మహిళా ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. దీనికి తోడు మహిళల్లో ప్రధానంగా మానసక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి కొన్ని రకాల హార్మోన్లు లోపించి క్యాన్సర్ వంటి వ్యాధులబారిన పడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

పరీక్షలు చేయించుకోవాలి

వ్యాధుల బారిన పడిన మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలో చికిత్స తీసుకుంటే రోగం తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పా టు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ప్రతి మంగళవారం ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. త్వరలో వారంలో రెండు రోజులు సేవలందిస్తాం. గ్రామీ ణ ప్రాంత మహిళలు మూఢ నమ్మకాలకు విడనాడాలి. ఎలాంటి సమస్య ఉన్నా మహిళా ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల సలహాలు పాటించాలి.

 డాక్టర్ పాల్వన్‌కుమార్, 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి