calender_icon.png 24 October, 2024 | 5:56 AM

ఆదర్శ దంపతులు.. ఆరుట్ల జంట

17-09-2024 04:46:52 AM

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి దంపతుల తెగువ ఎంతో స్ఫూర్తిదాయకం. దంపతుల ధీరత్వం.. నేటి తరానికీ స్ఫూర్తిదాయకం. ఇప్పటి యాదాద్రి జిల్లా కొలనుపాకకు చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి విద్యార్థి దశ నుంచే జమీందారీ, జాగీర్దార్ల దౌర్జన్యాల వ్యతిరేక ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. జీవన సహచరిగా కమలాదేవి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమెను ప్రోత్సహించారు.

బాలికలకు విద్య అందించేలా చూశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహిళా చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయ ఉద్యమాలు నడిపారు. మట్టి మనుషులను పోరాటోన్ముఖులను చేసి నైజాం సర్కార్‌ను ఎదురించి పోరాటం చేశారు. దున్నేవాడికే భూమి నినాదంతో భూమి పంపకాలకు తెరతీశారు. సాయుధ దళాలను నిర్మించారు. తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైన తర్వాత కూడా ఆరుట్ల దంపతులు  ప్రజల మధ్యే జీవితం గడిపారు.