* కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం
* బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపణ
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఒక రంగుపోయి.. మూడు రంగులు వచ్చాయని, ఇంకేమి మార్పు రాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవాచేశారు. కొం దరు మంత్రులు భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై కన్నేశారని ఆరోపించారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి, రామ చంద్రాపురం మండలాల మధ్య లో ఓ భూవివాదం చాలా రోజులుగా కొనసాగుతోంద న్నారు.
శంకర్‌పల్లి మండలం కొండకల్, రామచంద్రాపురం మండలంలో వెలిమల గ్రామ శివారు మధ్యలో మిగిలిన భూమి 429 ఎకరాలను ప్రభుత్వ అధికారులు గుర్తించారని తెలి పారు. తాము భూమి దున్నుకుంటూ ఉన్నామని పట్టాలు ఇవ్వాలని గిరిజనులు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగారని, అందులో 180 ఎకరాల భూమి వివిధ పరిశ్రమలకు ఏపీఐఐసీ కేటాయించిందని ఆయన చెప్పారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన భూ స్వామి కేవీ నర్సింహారెడ్డి 1979లో సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి ఇచ్చారని, 429 ఎకరాల్లో చివరకు 85 ఎకరాలు మిగిలిందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచే ఆ భూమిపై కన్ను పడిందన్నారు.
2009లో మొదలైన భూ పంచాయితీ ఇంకా కొనసాగుతోందని, గిరిజనుల మీద 17 కేసులు పెట్టారని రఘునందన్ వివరించారు. ఆ గ్రామంలో ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించి.. పోలీసుల రక్షణలో ఆ 85 ఎకరాలు కబ్జా చేశారని, మూడు రోజులుగా సంగారెడ్డి పోలీసులు వెలిమాల శివారులో డ్యూటీ చేస్తున్నారని, రూ.1,200 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
85 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని, అరబిందో, అపర్ణ సంస్థల పేర్లు పహాణీలో రాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం ఆ స్థలం వద్దకు వెళ్తున్నామని, ఇదే విషయాన్ని డీజీపీకి కూడా చెబుతున్నామని ఎంపీ రఘునందన్ వెల్లడించారు.