calender_icon.png 24 December, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ ఫలితాలపై కన్ను

14-10-2024 02:09:30 AM

ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 13:  ప్రధాన కార్పొరేట్లు వెల్లడించే క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారని, వీటితో పాటు ద్రవ్యోల్బణం డేటా, విదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఈ వారం మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ క్రూడ్ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని విశ్లేషకులు చెప్పారు. ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తదితర ప్రధాన కంపెనీలు ఫలితాల్ని వెల్లడిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.

ఒక వారం భారీ పతనాన్ని చవిచూసిన అనంతరం గతవారం భారత్ మార్కెట్ స్వల్పంగా తగ్గింది.అక్టోబర్ 4తో ముగిసినవారంలో  సెన్సెక్స్ 3,883 పాయింట్లు,  నిఫ్టీ 1,164 పాయింట్లు చొప్పున పడిపోయాయి. అక్టోబర్ 11తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున తగ్గాయి. కొన్ని హెవీవెయిట్ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ సూచీల నష్టం పరిమితంగా ఉన్నదని అజిత్ మిశ్రా వివరించారు. 

నేడు ద్రవ్యోల్బణం గణాంకాలు

సెప్టెంబర్ నెల రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం వెలువడతాయని, ఆర్బీఐ వడ్డీ రేట్ల బాటను నిర్దేశించే ఈ గణాంకాలు ఈ వారం ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు.  ఈ వారం భారత్‌తో పాటు చైనా, యూకేల ద్రవ్యోల్బణం డాటా కూడా వెలువడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు పెరగటం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలపై ఈ ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మారుస్తుందని వివరించారు. ప్రీమియం విలువల్లో ట్రేడ్‌కావడం, క్యూ2 ఫలితాలపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నందున మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేషన్ బాటలో ఉన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

ఎఫ్‌పీఐ అమ్మకాలు రూ. 58,700 కోట్లు

అక్టోబర్ నెలలో ఇప్పటవరకూ రూ. 58,711 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు.   ఇజ్రాయిల్, ఇరాన్‌ల పరస్పర దా డులు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం, చైనా ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ఆకర్షణీయంగా మారడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను అమ్మకాలకు పురికొల్పాయని విశ్లేషకులు తెలిపారు. వీరు సెప్టెంబర్ నెల మొత్తం భారత్ మార్కెట్లో రూ. 57,724 కోట్లు పెట్టుబడి చేశారు.

ఇటీవల యూ ఎస్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం కూడా భారత్ మార్కెట్ నుంచి చౌకగా ఉన్న మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నిధులు తరలించడానికి మరో కారణమని వినోద్ నాయర్ చెప్పారు. చైనా మార్కెట్లలో అర్బిట్రేజ్ అవకాశాల్ని వా రు అందిపుచ్చుకుంటున్నారన్నారు. ఆర్బీఐ తన ద్రవ్య విధానాన్ని న్యూట్రల్‌గా మార్చినప్పటికీ, సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేకపోవడం కూడా విదేశీ ఫండ్స్‌ను నిరుత్సాహపర్చిందన్నారు. 

నిఫ్టీ టెక్నికల్స్ బలహీనమే

జేఎం ఫైనాన్షియల్స్ అంచనాలు

వరుసగా రెండు రోజులు నిఫ్టీ 25,000 పాయింట్ల స్థాయి దిగువన ముగిసినందున సమీప భవిష్యత్తులో ట్రెండ్ బలహీనంగానే ఉంటుందని జేఎం ఫైనాన్షియల్స్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్  తేజాస్ షా అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లపై బేర్స్ పట్టు బిగించారని, పుల్‌బ్యాక్ ర్యాలీలను షార్ట్ పొజిషన్లు క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని తెలిపారు.

నిఫ్టీకి 25,000 తదుపరి అవరోధం 25,250 పాయింట్ల వద్ద కలగవచ్చని, 24,920 శ్రేణి మధ్యలో తక్షణ మద్దతు లభిస్తున్నదని విశ్లేషించారు. ఈ వారం  నిఫ్టీకి ఇటీవలి కనిష్ఠస్థాయి గట్టి మద్దతుగా నిలుస్తుందని, 25,150 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చని, ఆ స్థాయిని దాటితేనే తదుపరి కొనుగోళ్లు జరుగుతాయని యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు రాజేశ్ పాల్వియా అంచనా వేశారు.