calender_icon.png 16 October, 2024 | 7:46 PM

రూ.15 లక్షల కోట్ల ఆస్తులతో విస్తరించిన కెనరా బ్యాంక్

29-09-2024 12:00:00 AM

దేశంలో 118 ఏండ్ల క్రితం నెలకొన్న కెనరా బ్యాంక్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఆస్తుల రీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత నాల్గవపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది. సంఘ సంస్కర్త, విద్యాదాత, వృత్తిరీత్యా న్యాయవాది అయిన అమ్మేంబల్ సుబ్బారావు పాయ్ ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలో మంగళూరులో కెనరా బ్యాంక్‌ను 1906 జూలై 1న నెలకొల్పారు.

అప్పట్లో ఆ ప్రాంతంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ బ్రిటన్ బ్యాంక్ పతనంకావడంతో దేశీయుల స్వయం సహాయక నిధిగా కెనరా హిందూ పర్మినెంట్ ఫండ్ పేరుతో పాయ్ ఏర్పాటు చేసిందే ప్రస్తుత కెనరా బ్యాంక్. తదుపరి క్రమేపీ మరికొన్ని బ్యాంక్‌లను కూడా టేకోవర్ చేసి కెనరా బ్యాంక్ క్రమేపీ విస్తరించింది.

1969లో కేంద్ర ప్రభుత్వం కెనరా బ్యాంక్‌తో సహా 14 ప్రధాన ప్రైవేటు బ్యాంక్‌ల్ని జాతీయం చేయడంతో అప్పటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ల సంఖ్యను తగ్గించే క్రమంలో కేంద్రం ప్రతిపాదించిన విలీన ప్రక్రియలో భాగంగా 2020లో కెనరా బ్యాంక్‌లో మరో ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేశారు. దీనితో కెనరా బ్యాంక్ నాల్గవ పెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా ఆవిర్భవించింది. 

విస్తరించిన వ్యాపారాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాంప్రదాయక రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్‌లతో పాటు క్రెడిట్ కార్డ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్,  ఇన్సూరెన్స్ తదితర విభాగాల్లోకీ విస్తరించింది.

మ్యూచువల్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాల్లో పేరొందిన కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్, కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు ఈ బ్యాంక్‌కు సబ్సిడరీలే. వాటిలో కొద్దిపాటి వాటాను విక్రయించడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న యోచనలో కెనరా బ్యాంక్ ఉన్నది. 

రూ.1.03 లక్షల కోట్ల మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే కెనరా బ్యాంక్  ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,02,589 కోట్లు. గడిచిన మూడేండ్లలో కెనరా బ్యాంక్ షేరు 3.5 రెట్లు పెరిగింది. ఇన్వెస్టర్లకు అత్యధిక రాబడులు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో కెనరా బ్యాంక్ ముందుంది.

9,600కుపైగా శాఖలు.. 11.42 కోట్ల ఖాతాదారులు

కెనరా బ్యాంక్‌కు 2024 జూన్‌నాటికి 11.42 కోట్ల  ఖాతాదారులున్నారు. ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.14.91 లక్షల కోట్లు.  దేశవ్యాప్తంగా 9,627 శాఖలు, 8,200 మందికిపైగా ఉద్యోగులతో కెనరా బ్యాంక్ బ్యాంకింగ్ సర్వీసుల్ని అందిస్తున్నది. 12,500కు పైగా ఏటీఎంలను ఏర్పాటుచేసింది.

తెలుగు రాష్ట్రాల్లో  కెనరా బ్యాంక్‌కు 1000 కుపైగా శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 62.93  శాతం వాటా ఉన్నది. కెనరా బ్యాంక్‌కు ప్రస్తుతం విజయ్ శ్రీరంగన్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ బ్యాంక్‌కు తెలుగు వ్యక్తి  కె సత్యనారాయణ రాజు ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.