calender_icon.png 20 September, 2024 | 5:14 PM

రుణమాఫీలో దేశానికే ఆదర్శం

21-07-2024 12:00:00 AM

డా. సంగని మల్లేశ్వర్ :

కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉండరంటూ విమర్శలు చేసిన విపక్షాలకు చెంపపెట్టులా రైతును రాజును చేయాలనే దూరదృష్టితో నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ఫసల్ బీమా’ (పంటల బీమా) పథకానికి మంగళం పాడితే, నేడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పునరుద్ధరించింది. విపత్తుల భయం లేకుండా ‘దండగ’ అన్న వ్యవసాయంలోనే  రైతులు పండగ చేసుకుంటున్నారు. రుణమాఫీ పథకం రైతుల మదిలో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచింది. కేంద్రంలో పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వం రైతులు అడిగిన కనీస మద్దతు ధరకూడా ఇవ్వకుండా, 750 మంది రైతులను పొట్టన పెట్టుకుంది.

దశాబ్ద కాలం పాలించిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ  వడ్డీలకే సరిపోయింది. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన లక్ష రూపాయల అమలుకు ‘తలప్రాణం తోకకు వచ్చినంత’ పనయింది. హామీ ఇచ్చిన రూ.28 వేల కోట్ల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేయాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి అంటే అధికారం కోల్పోయిన అక్కసుతో అవాకులు, చెవాకులు పేలిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు ఇప్పుడు తల తిరిగిపోయి ఏం చేయాలో పాలు పోవడం లేదు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, ఆర్థిక వనరుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందనడానికి ఆరు గ్యారెంటీల అమలు నిలువెత్తు తార్కాణం.

నాడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రు.74 వేల కోట్ల రుణమాఫీ చేసింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ చేయడం పట్ల  రైతన్నల కుటుంబాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేసింది. నెలాఖరుకు లక్షన్నర, ఆగస్టు 15కల్లా రెండు లక్షల రుణాల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలనీ ఆదేశించింది. రైతు కుటుంబ నేపథ్యం ఉన్న సిద్దిపేట కలెక్టర్ సంబురాల్లో పాల్గొంటే తప్పుబడుతున్నారు. అదే సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి బీఆర్‌ఎస్ కార్యకర్తగా గులాం గిరి చేసినప్పుడు ఆ పార్టీ నాయకులకు ఎందుకు గుర్తుకు రాలేదన్న వెయ్యి డాలర్ల ప్రశ్న తెలంగాణ సమాజం నుండి వస్తున్నది.

హరిత విప్లవం తెచ్చిందే కాంగ్రెస్

నాడు కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు, జై జవాన్, జై కిసాన్ నినాదం వినిపించి, ఇందిరమ్మ రాజ్యంలో హరిత విప్లవానికి పునాది వేసింది. రాజీవ్‌గాంధీ పాలనలో వ్యవసాయ రంగంలో కొత్త మెళకువలు తెచ్చి ఆధునీకరించింది. ఆర్థ్ధిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు కాలంలో రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యుపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏకకాలంలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది. నేడు అర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రైతన్నలను ఆదుకోవడానికి ‘రైతు న్యాయ్’ ప్రకటించింది. శాసనసభ ఎన్నికలలో రుణమాఫీ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా ఏకకాలంలో దేశ చరిత్రలోనే మొదటిసారి 60 లక్షలమంది రైతులకు మేలు చేసింది.

‘ఈ ఘనతను సాధించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది అనుముల రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే’ అనే భావన అన్నదాతల్లో నెలకొంది. ఏడు లక్షల కోట్ల అప్పులు మోపినా ఏ మాత్రం జంకకుండా రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతన్నల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో రైతన్నల సంబురాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ దేశ చరిత్రలోనే చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తే నాటి కేసీఆర్ ప్రభుత్వం హేళన చేసింది. ఇంతెందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో మరోమారు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ కరాఖండిగా చెప్పితే ‘అది అయ్యేపని కాదు, రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా’ అంటూ హరీశ్‌రావు సవాలు విసిరారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి దశలో లక్ష రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమ చేసి అప్పుల ఊబినుంచి బయటపడేసారు. ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు లేని విధంగా 60 లక్షలమంది రైతులకు రూ.31వేల కోట్ల రుణాలు మాఫీ అవుతుండడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందనే భావన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగానే పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ ‘ట్రింగ్.. ట్రింగ్’ అంటూ జమకావడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్ల్లివిరిసింది.

హరీశ్ శపథం విఫలమేనా?

వెనుకటికి ‘వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది’ అని ఓ సామెత. ఇదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో రైతును రాజును చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలను ఎద్దేవా చేసి, వెకిలి మాటలతో మాట్లాడిన తీరు గడువుకు ముందే రేవంత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టడానికి కారకులైనారు. ‘రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని’ హరీశ్‌రావు శపథం చేసారు. పైగా ‘చేయక పొతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా?’ అంటూ ప్రతి సవాలు విసిరి హేళన చేసారు. గతంలో కేటీఆర్, హరీశ్‌రావు ‘చేతగాక పోతే సీఎంగా పదవి నుంచి తప్పుకోవాలని’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు, గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ‘ఒకే దఫా రుణమాఫీ ఎలా ఇస్తారు?’ అంటూ అనుమానాలు లేవనెత్తారు. పైగా, అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారంటూ  చులకనగా మాట్లాడిన సందర్భమూ లేక పోలేదు. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇందిరాగాంధీ కుటుంబం మాట తప్పే కుటుంబం కాదు. ఆలస్యమైనా అన్యాయం జరుగదు. నాడు కరీంనగర్ వేదికగా సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా కేసీఆర్‌ను నమ్మి రాష్ట్రం ఇచ్చారు.

కేసీఆర్ అవకాశవాద రాజకీయాలతో మాట తప్పి మొండిచెయ్యి చూపెట్టినా, కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నా పార్టీకీ జవసత్వాలు నింపే నాయకుడిని పీసీసీ అధ్యక్షులుగా నియమించారు. దశాబ్ద కాలం తర్వాత వరంగల్ వేదికగా తెలంగాణ గడ్డమీద రైతుగర్జనలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, అదే మాదిరిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  రేవంత్ నాయకత్వంలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది. బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారంటూ ‘చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చినట్టు’ చెప్పుకొస్తున్నది. విపక్షాలు అవునన్నా, కాదన్నా రైతు రుణమాఫీలో తెలంగాణ ‘రోల్ మోడల్’ గా నిలిచింది.  

వ్యాసకర్త జర్నలిజం శాఖ విభాగాధిపతి, 

కాకతీయ విశ్వవిద్యాలయం

సెల్: 9866255355