07-02-2025 10:51:47 PM
24 డిప్ బస్తీ వాసుల ఆందోళన..
ఫిర్యాదులు అందినా అంతులేని నిర్లక్ష్యం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 24 డిప్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో నిత్యం విద్యుత్ ప్రమాదం పొంచి ఉంది. సింగరేణి క్వార్టర్స్ ప్రారంభంలోని గడ్డం శ్రీనివాస్ ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) గ్రౌండ్ నుండి ఇచ్చే ఎర్త్ లైన్ లో కొన్ని నెలలుగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ మంటలకు ఎర్త్ లైన్ తెగిపోతే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ప్రాంతంలో హై వోల్టేజ్ విద్యుత్ ప్రసారమై పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ లైన్ తగిలి పలువురు షాక్ కు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలోని కార్మికుల కుటుంబాలు ప్రాణాల చేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.
సంబంధిత సింగరేణి విద్యుత్ అధికారులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేసిన వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని బస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ఎర్త్ లైన్ కు విద్యుత్ ప్రసారం అధికంగా జరిగి మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి విద్యుత్ ప్రమాదాల బారి నుండి కాపాడాలని బస్తీ ప్రజలు కోరుతున్నారు.