20-04-2025 12:59:19 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆదివాసీల గుండెల్లో మాయని గాయంగా నిలిచిపోయిన ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు నేటితో 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపం అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరుల స్థూపం వద్ద మొన్నటి వరకు ఆంక్షలు ఉండగా.. నేడు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆదివాసి గిరిజనులు చట్టబద్ధమైన హక్కుల కోసం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జల్ జమీన్ జంగిల్ నినాదంతో ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20వ తేదిన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వేలాదిగా ఆదివాసి గిరిజనులు తరలివచ్చారు. తొలుత సభకు అనుమతినిచ్చినా ఆ తర్వాత ఈ సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించింది. అప్పటికే ఇంద్రవెల్లి జనసంద్రంగా మారడంతో పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు ఆదివాసీలకు మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి కాల్పులకు దారితీసింది. అప్ప టి ఆర్డీవో ఆదేశాల మేరకు పోలీసులు ఆదివాసీలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. అయితే అంతకన్నా ఎక్కువ మందే మరణించారని పౌర హక్కుల సం ఘాలు పేర్కొన్నాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 20వ తేదిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఆదివాసుల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కాల్పులు జరిగిన ప్రాంతంలోనే 80 అడుగుల స్థూపా న్ని నిర్మించారు. కానీ ఆ స్థూపాన్ని 1986లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. ఆదివాసులు చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో స్థూపాన్ని నిర్మించారు.
ఏప్రిల్ 20 రోజు వస్తే చాలు ఆ ప్రాంతంలో 144 విధించడంతో పాటు పలు పోలీస్ ఆంక్షలు విధించేవారు. ఘటన జరిగిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఏప్రిల్ 20వ తేదీన ఎవరిని స్థూపం వద్దకి రానివ్వకుండా ఆంక్షలు విధించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంక్షలను సడలించడంతో గిరిజన సంఘాలు, ప్రతినిధులు, ఆదివాసి గిరిజనులు ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. నేడు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.