రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి
గద్వాల, (విజయక్రాంతి): ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని పక్క ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తో కలిసి రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో ఇంటింటి సర్వే కీలకమని, ఇంటింటి సర్వేను బూత్ లెవల్ అధికారుల ద్వారా నిర్విరామంగా చేపట్టాలని సూచించారు. ఈ సర్వేలో కొత్త ఓటర్ల నమోదు, ఫోటో మార్పులు, చిరునామా సవరణలు, ఇతర సవరణలు పకడ్బందీగా చేయాలని, తప్పులేమి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతీ తహసీల్దారు తమ పరిధిలోని బూత్ లెవల్ అధికారుల పనితీరును క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
ప్రతి ఓటరు జాబితా సవరణ సక్రమంగా పూర్తి కావాలని ఆదేశించారు. ఈక్వీ రేషియోను పెంచే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఉన్న ఓటర్లకు బూత్ లెవల్ అధికారుల పేర్లు, వారి కాంటాక్ట్ వివరాలు తెలియజేసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫారం 6 నుండి 8 వరకు నిర్ణీత సమయంలో పూర్తిగా పూర్తవ్వాలని, ఫారం-8 ద్వారా మరణించిన వ్యక్తుల వివరాలు సేకరించి ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని హోటల్ జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని సూచించారు.
ఈ ప్రక్రియను నిర్దిష్టమైన సమయపరిమితిలో పూర్తి చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఉండాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రాఫ్ట్ ఫోటో జాబితా విడుదలకు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఓటరు జాబితా రూపకల్పనకు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో స్వీప్ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఈ సందర్భంగా బిఎల్ఓ లు నిర్వహిస్తున్న రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింగరావు , శ్రీనివాస రావు , ఆర్.డి.ఓ. రామ్ చందర్, ఎన్నికల విభాగం సూపరిడెంట్ నరేష్, అన్ని మండలాల తహసీల్దార్లు, బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.