calender_icon.png 30 October, 2024 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరవీడిన అప్ప చెరువు

01-09-2024 01:47:58 AM

బఫర్‌లో నిర్మాణాలు నేలమట్టం

నాలుగు ఎకరాలు కాపాడిన హైడ్రా

అడ్డుకొనేందుకు కబ్జాదారుల యత్నం

పలువురిని అరెస్టు చేసిన పోలీసులు 

అధికారులది దౌర్జన్యం: కార్పొరేటర్

రాజేంద్రనగర్, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ అప్ప చెరువులోని ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు పంజా విసిరారు. శనివారం ఉదయం నుంచే భారీ హిటాచీలు, జేసీబీలతో అక్కడికి చేరుకొని కూల్చివేతలు ప్రారంభించారు.

నిర్మాణాల్లో కొన్ని మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించినవి ఉండటంతో ఆయ న అడ్డుకునే యత్నం చేశారు. అయినా హైడ్రా అధికారులు అలాగే ముందుకు సాగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్ప చెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో చాలాకాలంగా షెడ్లు, పలు కంపెనీలు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో అక్కడికి చేరు కొని నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైడ్రా అధికారులను స్థానికులు కూడా అడ్డుకున్నా రు.

తాము చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడు కూల్చి వేస్తే రోడ్డున పడుతామని వాపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురిని అదుపులో కి తీసుకున్నారు. హైడ్రా అధికారులు ఏమా త్రం వెనక్కి తగ్గకుండా కూల్చివేతలు కొనసాగించారు. మొత్తం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

అప్ప చెరువు మొత్తం 40.013 ఎకరాల ఎఫ్‌టీఎల్ విస్తరించి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందుల్లో చాలాభాగం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. అధికారులు ఎప్పటికప్పుడు భారీగా ముడుపులు తీసుకొని వారికి అన్ని వసతులు కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు ఉంటే ఇన్ని రోజులు నిద్రపోయారా? అని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల ఉదాసీనతతోనే పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపిస్తున్నారు. 

అధికారులది దౌర్జన్యకాండ: కార్పొరేటర్ 

హైడ్రా అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. నిర్మాణాల్లో కొన్ని ఆయన కుటుంబానికి చెందినవి ఉన్నాయి. 1980లో సర్వే నంబర్ 88, 89లో పదెకరాల పట్టా పొలం తన తాత కొనుగోలు చేశారని తెలిపారు. అది మెట్ట, పట్టా పొలం అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెవెన్యూ అధికారు లు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ అని మార్కింగ్ చేయలేదని చెప్పారు. తమతోపాటు చాలా మంది షెడ్లు నిర్మించుకున్నారని.. షెడ్లు, ఇతర నిర్మాణాలకు విద్యుత్ బిల్లులు, డోర్ నంబర్లు ఉన్నాయని వివరించారు.

అసెస్‌మెంట్లు కూడా ఉన్నాయని చెప్పారు. గతం లో ఎప్పుడూ నోటీసులు కూడా ఇవ్వకుం డా ఇప్పటికిప్పుడు హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవ హరించారని మండిపడ్డారు. కనీసం షెడ్లు, ఇతర నిర్మాణాల్లో ఉన్న మెటీరియల్, పరికరాలను కూడా బయటకు తీసుకెళ్లే సమ యం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ అంశం పై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. 

10-12 ఎకరాలే మిగిలింది: హైడ్రా కమిషనర్ రంగనాథ్

అప్ప చెరువు మొత్తం 34 ఎకరాల్లో విస్తరించి ఉండగా ప్రస్తుతం 10- 12 ఎకరాలకు కుదించుకుపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కాలక్రమంలో అది పూర్తిగా కబ్జామయం గా మారిందని పేర్కొన్నారు. శనివారం వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన జాతీయ మీడియాతో అప్ప చెరువుకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్ 13న తీవ్రమైన వరదలు రావడంతో చెరువు మునిగిపోయిందని చెప్పారు. చెరువుకు భారీగా వరదలు రావడంతో చెరువుల్లో నిర్మించిన చాలా ఇళ్లు నీటమునిగినట్లు ఆయన వివరించారు. చెరు వులను రక్షించాలనే ఉద్దేశంతోనే అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివే స్తున్నట్లు ఆయన చెప్పారు.