calender_icon.png 13 March, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్షణమే విద్యాశాఖమంత్రిని నియమించాలి

13-03-2025 01:54:14 AM

  1. రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
  2. అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ నాయకుల యత్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): తక్షణమే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 14నెలలైనా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడని ఎద్దేవా చేశారు. విద్యారంగానికి చెందిన పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం నాయకులు బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

పోలీసులు వారిని అరెస్ట్ చేసి షాఇనాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్న గురుకులాలను కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

గురుకులాల్లో విద్యార్థుల మరణాల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి మొద్దునిద్ర వీడి తక్షణమే స్పందించాలని, గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజురీయెంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

సరూర్‌నగర్ యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్టుగా నిరుద్యోగ భృతి, యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నేతలు బూరుగు నవీన్‌గౌడ్, జీడి అనిల్, పెద్దమ్మ రమేశ్, కొనపురం శశిపాల్, మేకల రవి, బీ సుధీర్, శ్రీకాంత్‌గౌడ్, రాజేశ్‌నాయక్, నాగరం ప్రశాంత్, ఏల్పుకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.