calender_icon.png 18 January, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్ములా ఈ రేస్ నుంచి దృష్టి మరల్చే యత్నం

18-01-2025 02:18:56 AM

* బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే పోయింది

* కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేటీఆర్ యత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఓ వైపు విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్.. చర్చను పక్కదారి పట్టించేందుకే జడ్జి వద్దకు రావాలని సవాల్ విసరడం విచిత్రంగా ఉందన్నారు.

శుక్రవారం జీవన్‌రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికే బీఆర్‌ఎస్ దీక్ష చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులను మోసం చేసిన ఆ పార్టీ ఇప్పుడు రైతుల పేరుతో ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనట్లు రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని మర్చిపోయిందని, తమ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను ఇస్తున్నదన్నారు.

సన్నవరి పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, దీన్ని దేశంలోని ఇతర ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని జీనవ్‌రెడ్డి తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కోసం కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల వరకు సాయం చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.