వనపర్తి (విజయక్రాంతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా పకడ్బందీగా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఓ.సి సమావేశ మందిరం నుండి తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. ఏ ఒక్క ఇంటిని వదలకుండా, ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేయాలని సూచించారు. ఎన్ని ఇళ్ళు సర్వే పూర్తి చేశారు అనే వివరాలు ప్రతి రోజు సాయంత్రం 5.30 లోపు స్ప్రెడ్ షీట్ లో నమోదు చేయాలని సూచించారు. సర్వే నిర్ణీత గడువులో పూర్తి చేయాల్సి ఉంటుందని అందువల్ల ఎవరైనా ఎన్యుమరేటర్ ఒక రోజు రాని పక్షంలో అతని స్థానంలో రిజర్వులో ఉన్న ఎన్యుమరేటర్ ను పంపించి సర్వే చేయించాలని ఆదేశించారు.
కుటుంబ వివరాలు పూర్తి చేసిన ఫారం ఎవరి చేతికి ఇవ్వరాదని, ఫోటో తీసుకోవడం, లేదా కిరాక్స్ తీసుకోవడం వంటివి చేయరాదని వాటిని చాల జాగ్రత్తగా ఎంపీడీఓ కస్టడీలో ఉంచాల్సి ఉంటుందని ఆదేశించారు. ఎవరైనా ఎన్యుమరేటర్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే నిర్దేశించిన సమయానికి విజయవంతంగా ప్రారంభించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జడ్పి సి.ఈ.ఓ యాదయ్య, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు వి.సి. లో పాల్గొన్నారు.