ఆశా పరేఖ్.. పేరు వినగానే ‘కటీ పతంగ్’, ‘జబ్ ప్యార్ కిసీసే హూతా హై’, ‘తీస్రీ మంజిల్’, ‘కారవాన్’.. వంటి సూపర్ హిట్లన్నీ గుర్తొస్తాయి. ‘జూబ్లీ గర్ల్’, ‘హిట్ గర్ల్’ అనే బిరుదులు ఆశా సొంతం. కనులతో అభినయించడం, నెమలిలా నాట్యం చేయడం ఆమెకే సొంతం. ఆమె నటిస్తే సినిమాకు శకునం బాగుంటుందని నమ్మేవారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 95 చిత్రాల్లో నటించింది. సినిమా రంగంలో సుదీర్ఘమైన ఆమె కృషికిగాను 2020లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సెన్సార్ బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేశారు.
ఆశాపరేఖ్ 1942 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి బచ్చూభాయ్ పరేఖ్ గుజరాతీ జైన్ వ్యాపారి. తల్లి సల్మా ముస్లిం. పెళ్లయ్యాక ఆమె మతం మార్చుకొని సుధగా మారారు. ఆశ తల్లికి తన కూతురు సినిమాల్లో రాణించాలని కోరిక ఉండేది. అందుకే చిన్నప్పుడే కథక్, భరతనాట్యం నేర్పించారు. ప్రఖ్యాత గురువు బన్సీలాల్ భారతీ వద్ద శిక్షణ ఇప్పించారు. పదేళ్ల ప్రాయంలో ఆశ బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.
నటిగా లక్షణాలు లేవన్నారు!
పదహారేళ్లప్పుడు హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలెట్టారు. ‘గూంజ్ ఉఠీ శహ్‌నాయీ’లో ఎంపిక చేసినట్టే చేసి.. చివరి నిమిషంలో దర్శకుడు విజయ్‌భట్ ఆమెను తొలగించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అందంగా లేదనీ, నటి లక్షణాలు ఏమాత్రం లేవని. అలా తిరస్కారానికి గురైన ఎనిమిదో రోజునే దర్శకుడు నాసిర్ హుస్సేన్ నుంచి ఆమెకు పిలుపొ చ్చింది. ‘దిల్ దేకే దేఖో’ తో ఏకంగా అగ్ర నటు డు షమ్మీ కపూర్ సరసన అవకాశం వచ్చింది.
హీరోయిన్‌గా తను నటించిన మొదటి చిత్రమే పెద్ద హిట్. ఆ తర్వాత ‘ఘరానా’, ‘ఫిర్ వహీ దిల్ లాయా హూ’, ‘బహారోంకే సప్నే’,‘సాజన్ రజ్‌నీ’, ‘లవ్ ఇన్ టోక్యో’ లలో కవ్వించే నటనతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఆరోజుల్లో ఆమె హవా ఎలా ఉండేదంటే.. అగ్ర హీరోలకన్నా అత్యధిక రెముమ్యూనరేషన్ తీసుకునేది. 47ఏళ్ల కెరీర్‌లో దాదాపు నలభైకిపైనే అవార్డులు అందుకున్నారు.
అగ్రనటుల సరసన..
ఆశా పరేఖ్ బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే కాదు.. కలర్ వచ్చాక కూడా హిట్స్ ఇచ్చింది. దేవానంద్, రాజేశ్ కన్నాతో కలిసి ఆశా నటించింది. సునిల్ దత్‌తో కలిసి నటించిన ‘చిరాగ్’ మూవీలోని ‘తేరే ఆంఖోంకే సివా దునియామే రఖ్దా క్యా హై’ పాటకు ఫిదా కానివారుండరు. ధర్వేంద్రతో నటించిన ‘ఆయే దిన్ బహార్ కే’, శశి కపూర్‌తో ‘ప్యార్ కా మౌసమ్’ పెద్ద హిట్లయ్యాయి. ఆశా ఖాతాలో చాలా హీట్ సాంగ్స్ ఉన్నాయి.. వాటిలో కొన్ని.. అచ్ఛా తో హమ్ చల్తే హై (ఆన్ మిలో సజ్ నా), జాయియే ఆప్ కాహా జాయేంగే (మేరే సనమ్), సాయొనారా సాయొనారా (లవ్ ఇన్ టోక్యో), పర్దే మే రెహెనే దో (షికార్), నా కోయి ఉమంగ్ హై (కటీ పతంగ్), నిసుల్తానా రే (ప్యార్ కా మౌసమ్).
పెళ్లే వద్దనుకున్నా!
ఆశ నిజజీవితంలో ఎవరికీ చోటివ్వలేదు. ఆనాటి అగ్ర దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో వాళ్ల ప్రేమ పెళ్లిపీటలెక్కలేదు. తర్వాత ఆమెరికాకు చెందిన ఒక ప్రొఫెసర్‌తో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తాలూ పెట్టుకున్నారు. ఆయన అంతకుముందే ఒకమ్మాయితో సహజీవనం చేసేవారు. పెళ్లయ్యాక అది కొనసాగు తుందని ఖరాఖండిగా చెప్పడంతో ఆ సంబం ధం వదులుకున్నారామె.
ఈ రెండు సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన ఆశ ఇక జీవితంలో పెళ్లి అనే మాటకే చోటు ఇవ్వలేదు. ‘పెళ్లి చేసుకొని.. గంపెడు పిల్లలు కని.. ఒక అందమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని కలలు కనేదాన్ని. కొన్ని పరిస్థితుల కారణంగా అసలు పెళ్లే చేసుకోవద్దనుకున్నా. ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడూ పశ్చాత్తాపం చెందలేదు.
ఆ మాటకొస్తే నేను తీసుకున్నది అత్యు త్తమ నిర్ణయం అని ఇప్పటికీ నమ్ముతున్నా’ అంటూ ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే ముంబయిలో ‘కారా భవన్’ అనే డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తన పేరు మీదే ఓ హాస్పిటల్ కూడా నిర్మించారు. ఇప్పుడు వాటి కార్యకలాపాల్లోనే కాలం గడుపుతున్నారు.