calender_icon.png 20 October, 2024 | 5:16 AM

అభివృద్ధి పథంలో అమృత్‌భారత్ స్టేషన్లు

20-10-2024 02:33:30 AM

  1. ఏబీఎస్‌ఎస్ ద్వారా 1,830.4 కోట్లతో 38 స్టేషన్ల అభివృద్ధి
  2. 430 కోట్లతో చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి పనులు
  3. ముమ్మరంగా సాగుతున్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ
  4. త్వరలో చర్లపల్లిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రైలు వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో స్టేషన్లను తీర్చిదిద్దేం దుకు రైల్వే శాఖ భారీగా నిధులను విడుదల చేసి పనులు చేపట్టింది.

‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ (ఏబీఎస్‌ఎస్) కింద ఆధునిక సౌకర్యాలతో స్టేషన్లను తీర్చిదిద్దుతున్నారు. ఏబీఎస్‌ఎస్ పథకం కింద రాష్ట్రంలోని 38 స్టేషన్లను రూ. 1,830.4 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు రూ. 430 కోట్ల వ్యయంతో శాటిలైట్ టెర్మినల్‌గా అభివృద్ధి చెందుతున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2023 ఆగస్టు, 2024 ఫిబ్రవరిలో తెలంగాణలో స్టేషన్ల  అభివృద్ధికి శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ (నాంపల్లి), లింగంపల్లి రైల్వే టెర్మినల్స్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లిలో చేపట్టిన శాటిలైట్ టెర్మినల్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించేందుకు గాను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి స్టేషన్‌ను సందర్శించనున్నారు. 

దీర్ఘకాలిక లక్ష్యంతో అభివృద్ధి పనులు..

రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ పనులు రైల్వే శాఖ దీర్ఘకాలిక దృష్టితో చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. అందుకే కేంద్రం ఏబీఎస్‌ఎస్ పథకం తీసుకువచ్చి ముఖ్యమైన రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ పనులను చేపడుతున్నారు.

ఏబీఎస్‌ఎస్ ద్వారా అన్ని రైల్వేస్టేషన్లలో ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు, స్టేషనుకు దారి తీసే రోడ్లను వెడల్పు చేయడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, విశాలమైన పార్కింగ్ ప్రదేశం, లిఫ్టులు, ఎలివేటర్లు, పచ్చదనం, ఆహ్లాదకర అనుభూతిని చేకూర్చేందుకు స్థానిక కళలు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ స్టేషన్ల నిర్మాణం, ప్రాంగణానికి రెండవ ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం, సరిపడే విధమైన షెల్టర్ల నిర్మాణం, మరింత నాణ్యత గల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ స్టేషన్ నేమ్ బోర్డులు, వెయిటింగ్ హాళ్లకు అభివృద్ధి పనులు, వినియోగదారుల కోసం సైనేజీలు, నగరానికి  రెండు వైపులా అనుసంధానం, చక్కగా డిజైన్ చేయబడిన ఆధునిక ప్రయాణికుల సౌకర్యాల ఏర్పాటు, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్ వ్యవస్థ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. 38 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్ స్టేషన్ పనులు సుమారు 29శాతం పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేషన్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాచిగూడ, లింగంపల్లి రైల్వే టెర్మినల్స్ అభివృద్ధి కోసం స్టేషన్‌ల కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం చివరి దశలో ఉందని అధికారులు తెలిపారు. అన్ని స్టేషన్ల పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు ఎంతో మెరుగైన సేవలు అందుతాయని చెబుతున్నారు.