- తెలంగాణ సర్కార్ అవినీతిపై మోదీ ప్రచారం కాదు.. విచారణ చేయాలి
- సీఎం రేవంత్‌ను కాపాడేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరాటం
- అరెస్టు కాకుండా అదానీతో ఒప్పందం చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి
- కాంగ్రెస్ నేతల భరతం పట్టేందుకే ఢిల్లీ వెళ్లిన
- తెలంగాణకు వచ్చా.. ఏం చేస్తారో చేయండి: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 12(విజయక్రాంతి): తెలంగాణలో జరిగిన అమృ త్ టెండర్ల స్కామ్‌పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కోరారు. కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్పిన మోదీ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల అవినీతిపై పోరు చేసేందుకు తాను ఢిల్లీ వచ్చానని, త్వరలో మిగతా మంత్రులు అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ లు సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొం డ దామోదర్‌రావుతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో జరుగు తున్న అవినీతి, ఆర్‌ఆర్ టాక్స్ గురించి మహారాష్ర్ట ఎన్నికల్లో మాట్లాడటం కాదని.. వెంట నే అవినీతిపైన చర్యలు తీసుకోవాలని మోదీ ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేత లు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే.. అమృత్ టెండర్లలో జరిగిన అవినీతి నేపథ్యం లో చర్యలు తీసుకోవాలని, ఇది బీజేపీ చిత్తశుద్ధికి ఒక లిట్మస్ పరీక్ష అని అన్నారు.
క్రోనీ క్యాపిటలిజం గురించి ఢిల్లీలో మాటలు చెప్తున్న రాహుల్ గాంధీని, తెలంగాణలో ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎండగడతామని ఉద్ఘాటించారు. అమృత్ టెండర్ల అవినీతిపై ఫిర్యాదు చేసిన అనంతరం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్.. పార్లమెంట్ సమావేశాల లోపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
చర్యలు తీసుకోకుంటే రాజ్యసభలో గళం వినిపిస్తాం
పార్లమెంట్ సమావేశాలలోపు అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపైన కేంద్రం స్పందించకుంటే రాజ్యసభలో ఈ అంశంపై గళం విప్పుతామని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌పై వచ్చే ప్రతి విమర్శకు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి, కాపాడుతున్నారని.. 8 మంది ఎంపీలున్నా గత 11 నెలల్లో ఒక్కరు కూడా ప్రభుత్వ అవినీతిపైన మాట్లాడలేదని గుర్తుచేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలను గొర్రెల మాదిరి కొంటున్నారని విమర్శలు చేస్తున్న ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందనే సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. తనపై ఎలాంటి కేసు పెట్టుకున్నా, విచారణలు చేసుకున్న భయం లేదన్నారు. ఐదు వారాల కింద తెలంగాణ రెవెన్యూ మంత్రిపై ఈడీ దాడి జరిగిందని, ఇప్పటివరకు ఈడీ అధికారులుగానీ పొంగులేటిగానీ ఈ అంశంపై మాట్లాడలేదని అన్నారు.
ఈడీ దాడి తరువాత అదానీ వచ్చి అదే మంత్రితో చర్చలు జరిపారని, దానికి సంబంధించిన వివరాలు పొంగులేటి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎల్ అండ్ టీ, ఎన్‌సీఎల్ కంపెనీల కన్నా రాఘవ కంపెనీ గొప్పదా? ఈ విషయంలో మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. సీఎం రేవంత్‌కు కేసీఆర్ పేరు తలుచుకోలేని రోజు లేదని ఎద్దేవాచేశారు.
ముఖ్యమంత్రి సొంత బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి శోదా కన్‌స్ట్రక్షన్ పేరుతో భారీగా టెండర్లను కట్టబెట్టిందని, రూ.2 కోట్ల వార్షిక లాభం ఉన్న ఈ కంపెనీకి వందల కోట్ల టెండర్లను అప్పజెప్పారని ఆరోపించారు. ఇందుకోసం అన్ని అర్హతలు ఉన్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని ఉపయోగించారని, టెండర్లు గెలుచుకున్న కంపెనీ కేవలం 20 శాతం పనులను మాత్రమే చేస్తుందని, మిగతా పనులు సీఎం బావమరిది కంపెనీకి ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు.
ఇందుకు రాహు ల్ గాంధీ చెప్తున్న క్రోనీ క్యాపిటలిజం ఉదాహరణ అని అన్నారు. బహిరంగంగా అవినీ తి జరుగుతున్న నేపథ్యంలోనే టెండర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు స్పష్టంచేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని కూడా ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
191 ఆర్టికల్ ప్రకారం గతంలో సోనియాగాంధీ, హేమంత్‌సొరేన్ వంటి నాయకులు పదవులను కోల్పోయారని, త్వరలో రేవంత్‌రెడ్డి, పొంగులేటి కూడా పదవులు కొల్పోక తప్పదని అన్నారు.
అవినీతి నేతల భరతం పట్టేందుకే..
ఢిల్లీలో మాకేం పని అన్న మాటలపైన కేటీఆర్ స్పందిస్తూ.. తాము ఢిల్లీకి వస్తే మీకెందుకు భయమవుతుందని అడిగారు. జాతీయ మీడియా ముందు మీ పార్టీ అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. పొంగులేటి కంపెనీ పొందిన అవినీతి టెండర్ల పైన కూడా ఢిల్లీకి వచ్చి భరతం పడతామని స్పష్టంచేశారు. తమ సొంత కంపెనీకి టెండర్లు ఇచ్చిన పొంగులేటి పదవి కూడా ఊడటం ఖాయమన్నారు.
రాష్ట్రానికి వచ్చిన.. ఏం చేస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసి తెలంగాణకు వచ్చానని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. ఇకనుంచి కాంగ్రెస్ నాయకుల అవినీతి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు.
బావమరిదికి అమృతం.. ప్రజలకు విషం
సీఎం తన బావమరిది కోసం అమృత్ టెండర్ల ద్వారా అమృతం పంచి, కొడంగల్ ప్రజలకు విషం పంచుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మా కోసం అక్కడి ప్రజలపై లాఠీచార్జీలు చేసి, అరెస్టులు చేసి జైలు కు పంపుతున్నారని ఆరోపించారు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రజల భూములు లాక్కుంటున్నారని ధ్వజ మెత్తారు. కలెక్టర్‌పై దాడి చేసే పరిస్థితి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు జరగలేదని, ఒకవైపు కలెక్టర్ తనపై దాడి జర గలేదంటూ స్వయంగా చెప్తున్నప్పుడు మరి కేసులెందుకు, అరెస్టులెందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సొమ్ము 300 కోట్లు అబద్ధపు ప్రచారానికి
తెలంగాణ ప్రజల సొమ్ము రూ.300 కోట్లు మహారాష్ర్ట ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో చేయని పనులు చేసినట్టు రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటనలోని ఒక్క హమీని కూడా నెరవెర్చలేదని అన్నా రు.
మహారాష్ర్ట ప్రజలు ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయాలని, కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయవద్దని కోరారు. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకున్నది ప్రాంతీయ పార్టీలేనని, కాంగ్రెస్‌కు బీజేపీని ఆపే శక్తి లేదని చెప్పారు.