19-03-2025 12:44:37 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
హైదరాబాద్ (విజయక్రాంతి): అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.712 కోట్ల నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు సుమారు 35 శాతం పూర్తయ్యాయని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సౌత్ బేస్‌మెంట్ ఫినిషింగ్ పనులు, సౌత్ అప్రోచ్ రోడ్, రెండు భూగర్భ సొరంగాలు పూర్తయ్యాయన్నారు.
ఉత్తర, దక్షిణ భవనాల సివిల్ పనులు, ఎయిర్ కాన్‌కోర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సౌత్ ఈఎస్‌ఎస్, మరో రెండు భూగర్భ సొరంగాల పనుల్లోనూ కదలిక చురుగ్గా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో అద్భుతంగా మారుతుందన్నారు. ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.