calender_icon.png 22 September, 2024 | 3:03 PM

అమృత్ మథనం!

22-09-2024 02:37:12 AM

కేటీఆర్ x పొంగులేటి

8888 కోట్ల అవినీతి

  1. బామ్మర్దికోసం అమృత్ టెండర్లలో సీఎం అక్రమాలు 
  2. అర్హతలు లేకున్నా సృజన్‌రెడ్డి కంపెనీకి టెండర్లు
  3. రూ.2 కోట్ల కంపెనీకి రూ.వెయ్యికోట్ల పనులా?
  4. ఐహెచ్‌పీ కంపెనీ పేరుతో అక్రమాల జాతర
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తోందని, అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రూ.8,888 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు.

దీంతో ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పారు. సీఎం తన బామ్మర్ది సూదిని సృజన్‌రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయల పనులను కట్ట బెట్టారని విమర్శించారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి, ఆ కంపెనీ పేరుతో సృజన్‌రెడ్డికి టెండర్లను కట్టబెట్టారని తెలిపారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అని, సీఎం తన బామ్మర్ది కోసమే ఈ టెండర్లను అప్పగించారని ఆరోపించారు. టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్‌రెడ్డి బామ్మర్ది కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారని విమర్శించారు.

రూ.1,137 కోట్ల కాంట్రాక్టు గెలుచుకున్న తరువాత అసలు కంపెనీ 20 శాతం పని చేస్తుందని, ఎక్కడా కనిపించని సీఎం బామ్మర్ది కంపెనీ మాత్రం 80 శాతంతో రూ.వెయ్యి కోట్ల పని చేస్తుంది చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐహెచ్‌పీ కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని సీఎం ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎం స్వయంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంట్రాక్టు కట్టబెట్టారని విమర్శించారు.

‘సీఎం స్వయంగా బాధ్యత వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ అవినీతికి తేర లేపారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7,11,13 నిబంధనల కింద రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది’ రేవంత్ పదవి కొల్పోతారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిస్తే, ఆశ్రిత పక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షారులే. ఇవే చట్టాల కింద సోనియాగాంధీ తన పదవిని కోల్పోయారు.

2006లో సోనియా గాంధీ నేషనల్ అడ్వుజరీ కౌన్సిల్ చైర్ పర్సన్ పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం పదవిని కోల్పోయారు. కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప కూడా తన కుటుంబ సభ్యులకు అక్రమ మైనింగ్ అనుమతులు ఇచ్చినందుకు సీఎం పదవి కోల్పోయారు. 2011లో మహారాష్ర్ట సీఎం అశోక్ చవన్ ఆదర్శ కుంభకోణం వల్ల పదవి కోల్పోయారు. బామ్మర్ది కళ్లలో సంతోషం కోసం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.

సీఎం ఖజానా నింపుకోవడానికి అక్రమ టెండర్లు 

తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారు కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి అమృత్ పథకం కోసం పిలిచిన రూ.8,888 కోట్ల టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టడం లేదని అన్నారు. ఇండియన్ హ్యూమన్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరంతో సృజన్‌రెడ్డి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చిందని తెలిపారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని మండిపడ్డారు.

టెండర్ల పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ చేస్తున్న అనేక కుంభకోణాల వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతామని ప్రకటించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ‘సీఎం తన బామ్మర్దికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని ఇస్తున్న విషయం ప్రజల ముందు ఎండగడతాం. సృజన్‌రెడ్డి కంపెనీకి ఉన్న లాభం కేవలం రూ.రెండు కోట్లయితే అది రూ. వెయ్యికోట్ల పనులు చేస్తుందని చెప్తున్నారు.

పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్ పీ కేవలం రూ.200 కోట్లు పని చేస్తుందని అంటున్నారు. బామ్మర్ది కంపెనీకి రూ.1,100 కోట్ల పనులు ఇచ్చి జీవోలు ఎందుకు వెబ్‌సైట్‌లో పెట్టడం లేదు? రూ.రెండు కోట్ల కంపెనీకి రూ.వెయ్యి కోట్ల టెండర్ అప్పజెప్పి.. ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే ఈ టెండర్లలో గోల్‌మాల్ జరిగింది. రాష్ర్టంలో బయటకు సమాచారం రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయి. అమృత్ కేంద్ర ప్రభుత్వ పథకం. అందుకే ఈ టెండర్ల అక్రమాలపైన నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాశాం. టెండర్ల అక్రమాలను తేల్చాలని కోరాం’ అని వివరించారు. 

బీజేపీ నేతల మౌనం ఎందుకు?  

తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో జరిగిన అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు కాకుంటే పూర్తిస్థాయి విచారణకు కేంద్రం ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకుంటే.. ఈ అవినీతిపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

లేకుంటే రేవంత్‌రెడ్డికి బీజేపీ నేతలకు అవినీతితో సంబంధం ఉందని  అనుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మొదట మాట్లాడినా.. తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ మౌనం వహించిందని ఆరోపించారు. రాష్ర్టంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రేమ కథ నడుస్తుందని.. అందుకే ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి సుద్ధపూస అని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

దమ్ముంటే నిరూపించు

  1. నిరూపిస్తే పదవి వదులుకుంటా
  2. టెండర్లలో ఎలాంటి అవినీతి లేదు
  3. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి కౌంటర్
  4. సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడే
  5. ౨౩౦౦ కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది బీఆర్‌ఎస్ సర్కారే
  6. బట్టకాల్చి మీదవేస్తే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరిక

హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే అవినీతిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణ లను నిరూపించకపోతే రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు. అమృత్ పథకం టెండర్లలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

ఈ అంశంపై పరువు నష్టం దావా వేసి కేటీఆర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘౨౦౨౩, సెప్టెంబర్ 20న అమృత్ పథకానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది నిజం కాదా? అదే ఏడాది నవంబర్ 29న తెల్లవారితే పోలింగ్, ఎన్నికల కోడ్ ఉన్నా.. రూ.3,515 కోట్ల ప్రైస్ బిడ్లను తెరిచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? మూడు కంపెనీలకు నాటి ప్రభుత్వం 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. వాటిని పీఎల్‌ఆర్, మెఘా కంపెనీలకు 3.99 శాతం ఎక్సెస్‌తో ఇచ్చింది.

ఆ టెండర్లను పాత ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతోనే తమ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జాయింట్ వెంచర్ కంపెనీలైన సోదా, ఏఎంలకు గతం కంటే రూ.54 కోట్లు తక్కువకు టెండర్లు ఇచ్చాం. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా సృజన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సొంత బామ్మర్ది కాదు. కేటీఆర్‌కే సృజన్‌తో దగ్గరి సంబంధాలున్నాయి.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి. ఇదే సృజన్‌రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని పాకేజీ నం.7లో రూ.2,300 కోట్ల పని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు సృజన్‌కు కాంట్రాక్ట్ యిచ్చింది నిజం కాదా? మేము ఏ కంపెనీని బెదిరించలేదు. ప్రభుత్వం, సీఎంపై బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకంటే తక్కువకు టెండర్లు ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటి?’ అని మంత్రి ప్రశ్నించారు. 

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చెప్తున్న రూ.8,888 కోట్ల అవినీతి పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. రూ.3,516 కోట్లకు టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆదివారం ఎక్కడికి రావాలో టైమ్ చెప్పు.. మీరు చెప్తున్నది నిజమైతే నేను అక్కడే రాజీనామా చేస్తా. కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. మీ చంకలో ఉండే వ్యక్తే ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్. చిత్తశుద్ధి ఉంటే నా ఛాలెంజ్‌కు సమాధానమివ్వు.

అవినీతి నిరూపించిన గంటలో నేను రాజీనామా చేస్తా. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో సీఎం, మంత్రులు, ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలి’ అని సూచించారు. మిషన్ భగీరథ పథకంతో రూ.34 వేలకోట్లను కొల్లగొట్టింది గత  ప్రభుత్వమేనని, దీనిపై విచారణకు కేటీఆర్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేశారని మండిపడ్డారు. ‘నేను రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్‌ను. ఎవరికీ భయపడను. నా కాంట్రాక్టు పనులపై మాట్లాడటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటా. ఓపెన్ టెండర్లు పిలిచాం. అర్హత సాధించిన కంపెనీలకు ప్రభుత్వం టెండర్ ఇచ్చింది. ఇందులో దాపరికం ఏమీ లేదు’ అని పొంగులేటి స్పష్టంచేశారు. 

కేటీఆర్ విమర్శలు అర్థరహితం: వీవీఎస్ చౌదరి 

అమృత్ పథకం టెండర్లలో రూ.1,137 కోట్ల పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బామ్మర్ది సృజన్‌రెడ్డికి కట్టబెట్టి రూ.8,888 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న కేటీఆర్ విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత వెలగపూడి వీవీఎస్ చౌదరి తీవ్రంగా ఖండించారు. నిబంధనల ప్రకారం టెండర్లు దక్కించుకోవడం, పనులు చేయడం అవినీతి ఎలా అవుతుందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేయడం ఏ విధంగా అవినీతి అవుతుందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత అవినీతి జరిగింది? ఎక్కడ జరిగిందో చెప్పకుండా కేవలం సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్దికి చెందిన కంపెనీ అమృత్ టెండర్లు దక్కించుకోవడమే కుంభకోణంగా పేర్కొనడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. 

అమృతమా? విషమా?

అమృత్ టెండర్లపై అధికార, విపక్షం ఢీ

కేటీఆర్, పొంగులేటి వాడివేడి సవాళ్లు

అసలేమిటీ టెండర్లు? ఎందుకీ వివాదం?

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం అమృత్‌లో టెండర్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఇం దులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయం గా బంధుప్రీతికి పాల్పడ్డారని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేయటం, అవినీతిని నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ అంతే దీటుగా సవాల్ విసరటంతో అందరి దృష్టి ఇప్పుడు అమృత్ టెండర్లపై పడింది. ఇంతకూ ఈ టెండర్ల కథ కమామిషు ఏమిటి? 

అమృత్ 2.0 పథకం కింద 98 వాటర్ సప్లు ప్రాజెక్టులు, 9 మురుగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు 3 ప్యాకేజీలుగా ప్రభుత్వం విభజించింది. 

  1. ఈ పనులను చేపట్టేందుకు మొత్తం రూ.5,385 కోట్లను మంజూరు చేస్తూ 20.9.2023 నాడు అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
  2. ఇందుకు సంబంధించిన టెండర్ల దాఖలుకు 14.11.2023 ఆఖరు తేదీగా ప్రకటించింది.
  3. ఈ టెండర్లను 29.11.2023 నాడు ఓపెన్ చేశారు.
  4. ప్యాకేజీ 1లో పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డికి చెందిన కంపెనీ) వేసిన టెండర్ ఎల్1గా నిలిచింది. ఇందులో ఆ కంపెనీ రూ.1,154 కోట్లుగా కోట్ చేసింది.
  5. ప్యాకేజీ 2లో గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (సత్యం, తేజరాజు+ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) వేసిన టెండర్ ఎల్ 1గా నిలిచింది. ఇందులో సదరు కంపెనీ రూ.1,180 కోట్లుగా కోట్ చేసింది.
  6. ప్యాకేజీ 3లో మెయిల్ సంస్థ ఎల్1గా నిలిచింది. ఇందులో రూ.1,321 కోట్లకు కోట్ చేశారు.
  7. ఈ మూడు ప్యాకేజీల్లోనూ ఎల్ 1 గా నిలిచిన మూడు కంపెనీలు కూడా 3.99 శాతం అధికంగా కోట్ చేశాయి. దీంతో నూతన ప్రభుత్వం రెండోరౌండ్ టెండర్లను పిలిచింది.
  8. మొదటి రౌండ్‌లో టెండర్లలో మొత్తం రూ.3,656.76 కోట్లతో మూడు ప్యాకేజీలకు టెండర్లు దాఖలవ్వగా.. రెండోరౌండ్‌లో ఇదే మూడు ప్యాకేజీలకు రూ.3,602.27 కోట్లకు టెండర్లు దాఖలు (ఎల్1) అయ్యాయి.
  9. ఇందులో ప్యాకేజీ 1కు సంబంధించి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్, శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ది ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ కలిసి రూ.1,137.77 కోట్లకు టెండర్ వేసి ఎల్1 గా నిలిచాయి.
  10. ప్యాకేజీ 2లో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్, అయ్యప్ప ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోయ అండ్ కంపెనీ కన్‌స్టక్షన్స్ లిమిటెడ్ (జేవీ) కలిసి రూ.1,163.03 కోట్లకు టెండర్ వేసి ఎల్1గా నిలిచాయి.
  11. ప్యాకేజీ 3లో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.1,301.27 కోట్లకు టెండర్ వేసి ఎల్ 1 గా నిలిచింది.
  12. అంటే రెండో రౌండ్ టెండర్ల దాఖలులో వ్యయం మొత్తం రూ.54.49 కోట్లు తగ్గింది. ఈ మొత్తం ప్రభుత్వానికి మిగిలినట్టయ్యింది.