శంకర్‌హిల్స్ ప్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్ ప్లాట్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బాధితులు.. అమోయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని అధికా రులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని 200 ఎకరాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా వేరేవారికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
ఇప్పుడు ఓనర్లునా తమను కనీసం ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. మాజీ మంత్రి కేటీఆర్ అండతో తమ ప్లాట్లను వ్యవసాయ భూములుగా మార్చి కబ్జా చేశారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 111 నుంచి 179 వరకు సుమారు 460 ఎకరాల భూమి ఉండగా, అందులోని 200 ఎకరాలను సుమారు 3,300 మంది కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ. 30 వేల కోట్లు ఉంటుందని బాధితులు తెలిపారు.