calender_icon.png 25 October, 2024 | 4:57 AM

రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన అమోయ్

25-10-2024 12:09:16 AM

  1. సుమారు 6 గంటల పాటు కొనసాగిన విచారణ
  2. శుక్రవారం మరోసారి హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థకశాఖ జాయింట్ సెక్రటరీ అమోయ్‌కుమార్ గురువారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బుధవారం ఆయనను ఈడీ అధికారులు 8 గంటలు పాటు విచారించిన విషయం తెలిసిందే.

కాగా, అమోయ్‌కుమార్ గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మహేశ్వరం మండలం నాగారంలో భూదా న్ భూముల బదిలీల్లో అక్రమాలు జరిగాయని, రూ. వందల కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేశారనే అభియోగాల నేపథ్యంలో ఆయన పాత్రపై ఈడీ సుదీర్ఘ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

మహేశ్వరం పరిధిలోని భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే క్రమంలో జరిగిన వందల కోట్ల లావాదేవీల్లో అప్పటి ప్రభుత్వంలో కీలక నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు మం త్రులతోపాటు వారి కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మహేశ్వరం భూముల విషయంలో విచారణ జరుపుతున్న ఈడీ..

మరింత లోతుగా ముందుకెళ్తే గత ప్రభుత్వంలోని నాయకుల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఐఏఎస్ అమోయ్‌ని విచారిస్తున్న ఈడీ బృందం.. తమకు లభించే వివరాల మేరకు అవసరమైతే నాయకులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో పలువురు జర్నలిస్టులకు కేటాయిం చిన ప్లాట్లు, స్థలాలపై కూడా ఈడీ విచారణ చేపట్టింది. గురువారం సుమారు 6 గంటల పాటు అమోయ్‌ను విచారించిన ఈడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, అమోయ్ సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.