calender_icon.png 18 October, 2024 | 3:37 AM

వినియోగం లేకున్నా బిల్లుల మోత

18-10-2024 12:30:18 AM

  1. బిల్లింగ్ నిర్వహణలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
  2. నెలనెలా సమీక్షించని అధికారులు 
  3. స్పాట్‌కు వెళ్లకుండానే బిల్లింగ్ చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నగరంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. వారి బాధ్యతారాహిత్యం ఫలితంగా వినియోగదారులకు బిల్లులు భారంగా మారు తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

సాధారణంగా విద్యుత్ మీటర్లు తిరగకున్నా.. ఏదైనా కారణాలతో పనిచేయకున్నా సదరు అధికారులు వినియోగదారులపై కేసులు బుక్ చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటిది వరుసగా నెలల కొద్దీ విద్యుత్ మీటర్లు పనిచేయనట్టుగా బిల్లింగ్‌లో డోర్ లాక్, స్టక్ అప్, నిల్ కన్సంప్షన్ తదితర కారణాలు నమోదు చేస్తూనే వినియోగదారులపై బిల్లుల మోత మోగిస్తున్నారు.

ఈ బిల్లుల వాలకం ఒక్కసారి పరిశీలిస్తే నెలనెలా బిల్లింగ్ నిర్వహణలో వచ్చే స్టేటస్‌లపై అధికారులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనేది స్పష్టమవుతోంది. ఫలితంగా ఆ తర్వాత నెలలో రెండు నెలల బిల్లును ఒకేసారి నమోదు చేయడంతో స్లాబ్ రేటు మారి వినియోగదారులకు కరెం టు బిల్లు భారంగా మారుతోంది. 

మీటర్లు పనిచేయకున్నా బిల్లింగ్..

గ్రేటర్ వ్యాప్తంగా 10 సర్కిళ్లలో దాదా పు 62 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెలా బిల్లుల రూపంలో దాదాపు రూ.2 వేల కోట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఆదాయంగా వస్తుంది. టీజీఎస్‌పీడీసీఎల్ పరిధి లో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో విద్యు త్ అధికారులు, సిబ్బంది ప్రతి నెలా బిల్లింగ్ చేయడం లేదనే ఫిర్యాదులు అధికమవుతున్నాయి.

ఈ తరహా సమస్యలను సాధారణ ప్రజలతో పాటు పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన వ్యక్తులు సైతం ఎదుర్కొంటూ నిరంతరం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మేడ్చల్, హబ్సీగూడ, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ తదితర సర్కిళ్లతో పాటు హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోనూ ఈ తరహా బిల్లింగ్ సమస్యలను వినియోగదారులు చవిచూడాల్సి వస్తోంది.

మే డ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగ తి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆగస్టులో బిల్లింగ్ చేసి సెప్టెంబర్ నెలలో డోర్ లాక్ ఆప్షన్ ఎంట్రీ చేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో బిల్లింగ్ చేయడంతో ఒకేసారి 537 యూనిట్లుగా బిల్లు నమోదు అయినందున స్లాబ్ రేటు మారి వేలకు వేలు బిల్లు వచ్చింది. హబ్సీగూడ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్‌లో నిల్ కన్సంప్షన్ ఎంట్రీ చేసి మరుసటి నెలలో ఒకేసారి బిల్లును బాదారు.

హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఆజామాబాద్ డివిజన్ రామాలయం సెక్షన్‌లో ఓ వినియోగదారుడికి వరుసగా నాలుగు నెలలు స్టక్ అప్ అం టూ బిల్లులో ఎంట్రీ చేశారు. రా జేంద్రనగర్, సైబర్ సిటీ, సరూర్ నగర్ సర్కిళ్లలోనూ జరుగుతుండటంతో వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

పర్యవేక్షణ లేక..  

సాధారణంగా విద్యుత్ బిల్లింగ్‌ను ఒక నెల డిపార్ట్‌మెంట్ ఏఈ, సంబంధిత అధికారులు.. మరో నెలలో ఔట్‌సోర్సింగ్‌లో బిల్లింగ్ రీడర్స్ విద్యుత్ బిల్లులను నమోదు చేస్తుంటారు. విద్యుత్ శాఖలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ ఎవరి విధులు వారికే ఉన్నాయి. వీటిలో అత్యంత కీలకమైంది ఆపరేషన్ విభాగం.

మొత్తం విద్యుత్ సరఫరా నిర్వహణతో పాటు ప్రతి నెలా బిల్లింగ్ చేయడం, వసూలు అయ్యేలా పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత. మీటర్ల మంజూ రు, మీటర్ల నిర్వహణలో అవకతవకలపై ఫోకస్ చేస్తుంటారు. వీటిలో ప్రతి నెలా బిల్లింగ్‌లో మీటర్ల స్టేటస్‌ను చూసి ఆ  సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.

కానీ, బిల్లులో వరుసగా డోర్ లాక్, స్టక్ అప్, నిల్ కన్సంప్షన్ అనే కారణాలు వస్తుంటే తక్షణమే పరిష్కరించాల్సి ఉండగా.. నెలనెలా లక్షల్లో జీతం, ఆపై వచ్చే అక్రమ సంపాదనపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించినట్టుగా విమర్శలు ఉన్నాయి.

డివిజన్ స్థాయిలో డీఈలు కింది స్థాయి అధికారులు, సిబ్బందితో ప్రతినెలా చేయాల్సిన సమీక్షలను నిర్వహించకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఈ తరహా సమస్యలతో స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోని కారణంగానే డివిజన్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.