తమ పేరు బయటకు వస్తుందేమోనని మాజీ ఎమ్మెల్యేల్లో బుగులు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలు, ఈ ఫార్ములా, ఫోన్‌ట్యాపింగ్ కేసులతో బీఆర్‌ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ కేసులతో కింది కేడర్ సైతం తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసుపై విచారణ వేగవంతమవడంతో గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే అరెస్టు భయం పట్టుకుంది. కేసుల విషయం బయటకు వచ్చి, తాము జైలుకు వెళితే ఇక తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని భయపడుతున్నారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్‌యాదవ్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారించడంతో ఆ భయం రెట్టింపైంది.
ప్రస్తుతం పోలీస్‌శాఖ మాజీ పోలీసు అధికారి మేకల తిరుపతన్న ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఎంతమంది నాయకులు ఈ కేసులో దొరుకుతారోనని గులాబీ పార్టీలో సీనియర్ నేతల అంచనాకు సైతం అందడంలేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
ఇవన్నీ సరిపోనట్లు తాజాగా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, అధికారులపై దాడి కేసు బీఆర్‌ఎస్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని కార్యకర్తలు ఆయనకు కాపలా ఉంటున్నట్లు సమాచారం. ఉదయమంతా ఒక టీం, రాత్రి మరో టీం ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారని తెలిసింది.
ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ సంభవిస్తే, అది అక్రమంటూ ప్రచారంచేసి, రాష్ట్రవ్యాప్తంగా ఆం దోళనలు, నిరసనలు చేపట్టే యోచనలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం. తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల ముందు నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తున్నది.
గతంలో పోస్టింగ్‌లు, సెటిల్‌మెంట్ల దందా..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో పెట్టుకుని, తమకు నచ్చిన వారిని ఎస్‌హెచ్‌వోలను నియమించుకుని ల్యాండ్ సెంటిమెంట్లు చేసేవారని, అంతేకాకుండా ప్రత్యర్థులను సైతం బెదిరింపులకు గురి చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.
విలువైన భూములను అనుచరులతో కబ్జా చేయించి, అసలైన యాజమాని అక్కడి వస్తే, అతడిపై దాడులు చేయించేవారని, అసరమైతే సదరు యజమానిపై అక్రమ కేసులు సైతం బనాయించే వారనే అపప్రద గులాబీ నేతలకు ఉంది. ఇలా నియోజకవర్గంలో రూ.200 కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ప్రచారం ఇప్పటికీ నియోజకవర్గాల్లో జరుగుతూనే ఉంది.
అలాగే పోలీస్ పోస్టింగ్ విషయంలోనూ గులాబీ నేతలు, ప్రజాప్రతినిధుల హవా నడిచే దని, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ పరిధిలో ఎస్‌హెచ్‌వో పోస్టుకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎమ్మెల్యేలు, లేదా వారి అనుచరులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒకవేళ ఎమ్మెల్యేలతో పనికాకుంటే ప్రస్తుతం ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ ఏఎస్పీ తిరుపతన్న ద్వారా సీఐలు పోస్టింగ్‌లు తెచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల నుంచి నాటి పాలకుల సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ నేత రూ.కోట్లు దండుకున్నాడని డిపార్టుమెంట్‌లో సైతం చర్చ జరిగింది.
చేరికల వైపు ఆలోచన..
రాష్ట్రప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతల అవినీతి బాగోతాలను బయటపెట్టి జైలుకు పంపేందుకు దారులు వెతుకుతున్నది. ఇప్పటికే ఏదో ఒక కేసులో కేటీఆర్ జైలుకు తప్పద నే ప్రచారం మొదలైంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ ప్రారంభమవడంతో ఎంతోమంది నాటి ప్రజాప్రతినిధులు తమ చిట్టా కూడా బయటపడుతుందని ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
తమను విచారణకు పిలవకుండా ఉండేందుకు సహకరించాలని ఇప్ప టికే కొందరు నేతలు కొందరు కాంగ్రెస్ బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు ఇతోధికంగా సాయం చేస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది.
కొందరైతే ఏకంగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ మవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే త్వరలో కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.