26-02-2025 12:00:00 AM
నిత్యం కలుషిత వాయువులతో ప్రజల ఇక్కట్లు
ఇండ్ల మధ్య నుండి ఫ్యాక్టరీలను తొలగించాలంటున్న స్థానిక ప్రజలు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 25 ( విజయ క్రాంతి): విషవాయులను వెదజల్లే ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులను తొలగించి, నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి బొంగ్లూర్, మంగళ్ పల్లి పటేల్ గూడ, మంగళ్ పల్లి గ్రామాల పరిధిలో చాలా వరకు రైస్ మిల్లులు, ఆయిల్ ఫ్యాక్టరీలు, ఫ్లై వుడ్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయని వాటి వల్ల విడుదల అయ్యే పొగ, దుమ్ము, నీరు కలుషితం అవుతున్నాయని వాపోతున్నారు.
వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషవాయువుల వల్ల ప్రమాద తీవ్రత పెద్దవారితో పాటు చిన్న పిల్లల మీద పడుతుందని, తద్వారా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, ఎలర్జీ, మైగ్రేన్, బి.పి గుండెపోటు సమస్య, క్యాన్సర్ బారిన పడే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
వీటన్నిటికీ ప్రధాన కారణం నివాసాల మధ్యలో ఉన్నటువంటి అతి ప్రమాదకరమైన రసాయనాలను పొగ, దుమ్ము ద్వారా గాలిలోకి పంపిస్తూ గాలిని కలుషితం చేస్తూ, అదేవిధంగా భూమిలోకి నీటిని పంపిస్తూ భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నారని,
వీటి వల్ల వచ్చే కాలుష్యంతో ఇక్కడ నివసించే సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై అధికారులు స్పందించి, విషవాయువులను వెదజల్లే ఫ్యాక్టరీలను, రైస్ మిల్లులను నివాసాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు.
నివాసాలకు దూరంగా తరలించాలి
ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న విషవాయువుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీల నివాసాలకు దూరంగా తరలించాలని యాజమాన్యానికి విన్నవించినా వారు పట్టించుకోవడం లేదు. కావున ప్రజాసమస్యలపై అధికారులు స్పందించి జనావాసాలు మధ్య నుండి తొలగించే దిశగా వీటిపై చర్యలు చేపట్టాలి.
బొడ్డు రవి, బొంగ్లూర్ నివాసి