calender_icon.png 3 March, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రల్లో పరకాయ ప్రవేశం అసాధారణ అందం

02-03-2025 12:33:29 AM

స్మితా పాటిల్.. వెండితెరపై ఒక్కసారిగా ఎగిసిన కెరటం.. దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీని ఏలిన తార .. మూడు పదుల వయసు నిండగానే నింగికెగిసింది. పదేళ్ల కాలంలో 80కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అప్పట్లోనే పద్మశ్రీ పురస్కారం అందుకున్న నటి స్మితా పాటిల్ రెండు జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తక్కువ కాలంలోనే ఆమె సాధించిన ఘనత ఇది.

స్మితా పాటిల్ 1986, డిసెంబరు 13న మరాఠా కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి శివాజీరావు గిరిధర్ పాటిల్ మహారాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడు. తల్లి విద్యాతాయి పాటిల్ ఒక సామాజిక సేవకురాలు. స్మిత తొలిసారి 1970లో దూరదర్శన్‌లో వార్తలు చదవడంతో కెరీర్ మొదలైంది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో డిగ్రీని పొంది శ్యాం బెనగల్ చిత్రం ‘చరణ్దాస్ చోర్’తో సినీరంగ ప్రవేశం చేసింది. సినిమాల్లో రాణిస్తుండగానే రాజ్ బబ్బర్‌తో పరిచయం కాస్తా ప్రేమగా మారిం ది. ఈ తరుణంలోనే స్మిత తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అప్పటికే రాజ్ బబ్బర్‌కు వివాహమైంది. తన భార్య నదీరా బబ్బర్‌ను వదిలేసి స్మితను వివాహం చేసుకున్నాడు. 

రీల్ లైఫ్..

స్మితా పాటిల్ శ్యాం బెనగల్‌తోపాటు గోవింద్ నిహలాని, సత్యజిత్ రే, జి.అరవిందన్, మృణాల్ సేన్ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసింది. మంతన్ (1977), ఆక్రోష్ (1980), చక్ర (1981), చిదంబరం (1985), మిర్చ్ మసాలా (1985) తదితర సినిమాల్లో నటించింది. 1984లో ఈమె మాం ట్రియల్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగానూ స్మిత వ్యవహరించింది. ‘మిర్చ్ మసాలా’ చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక ’భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనలు’ జాబితాలో చేర్చడం విశేషం.

స్మితను కొట్టిన అమోల్ పాలేకర్

చిత్రకారుడు అమోల్ పాలేకర్ ఒక సినిమా చిత్రీకరణలో స్మిత చెంప ఛెళ్లుమనిపించాడు. అందుకు ఆయన ఎన్నోసార్లు బాధపడ్డారు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తన పుస్తకం ‘వ్యూఫైండర్’ ఆవిష్క రణ సందర్భంగా ఆ ఉదంతాన్ని ప్రస్తావించాడు. అయితే అమోల్ పాలేకర్ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. తన భార్య నాటకాలు వేస్తుంటే తోడు గా వెళ్లి అలా ఓ నాటకంలో భాగమై తద్వారా సినిమాల్లోకి వెళ్లాడు. అయితే ‘భూమిక’ (1977) అనే సినిమాలో ఒక సన్నివేశంలో తనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ స్మిత ఇవ్వడం లేదని దర్శకుడు శ్యామ్ బెన గల్.. అమోల్‌ను పక్కకు పిలిచి టేక్‌లో ఆమెను లాగిపెట్టి కొట్టమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్మితను అమోల్ లాగి పెట్టి కొట్టాడు. దీంతో స్మిత షాకైంది. ఆ తరువాత శ్యామ్ బెనగల్‌కు కావాల్సిన భావాలు చక్కగా కుదిరాయి. అయితే సీన్ పూర్తవగానే స్మితను క్షమించమని అమోల్ వేడుకున్నాడు. 

31 ఏళ్లకే నింగికెగిసిన స్మిత..

రాజ్ బబ్బర్‌ను వివాహమాడిన స్మిత.. ప్రతీక్ బబ్బర్‌కు జన్మనిచ్చింది. కానీ ఆ తర్వాత తరచూ జ్వరంతో బాధపడేది. ఆమె పరిస్థితి నానాటికీ క్షీణించింది. ఒకరోజు సాయంత్రం.. తనతో పాటు బయటకు కూడా తీసుకెళ్లమని కోరింది. అయితే అదే ఆమె చివరి కోరిక అవుతుందని రాజ్ బబ్బర్ సైతం ఊహించలేదు. కాసేపటికే ఆమెకు రక్తపు వాంతులు అయ్యాయి. ఆ తర్వాత స్మిత మరణించింది. 1986 డిసెంబర్ 13న మరణంతో ఆమె కుటుంబమే కాదు.. సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే తారల్లో స్మితా పాటిల్ ఒకరు.