calender_icon.png 27 October, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మా బైలెల్లినాదో..

08-07-2024 03:30:03 AM

  • వైభవంగా బోనాల వేడుకలు ప్రారంభం 
  • తొలి బోనం అందుకున్న గోల్కొండ జగదాంబిక అమ్మవారు 
  • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 
  • లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి గోల్కొండకు తొట్టెల ఊరేగింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): భాగ్యనగరం ఆధ్యాత్మిక కాంతుల్ని అద్దుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని అమ్మకే ప్రేమతో నివేదించడం బోనాల సంప్రదాయం. చల్లని తల్లి.. కోరికలు తీర్చే కొంగుబంగారం నీవే అంటూ భక్తజనులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకలను పురస్కరించుకొని నగరంలో నెల రోజుల పాటు పోతురాజుల విన్యాసం, డప్పు చప్పుళ్లతో సందడి నెలకొననుంది.

ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలలో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జోగిని శ్యామల తదితరులు హాజరై బోనాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గోల్కొండ పరిసర ప్రాంత ప్రజలు కొత్త బట్టలు ధరించి తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి గోల్కొండ కోటకు తరలివచ్చారు. 

లంగర్‌హౌజ్ నుంచి ఊరేగింపుగా.. 

హైదరాబాద్‌లో ప్రతి ఏడాది అత్యంత వైభవోపేతంగా జరిగే బోనాల వేడుకలు ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి తొలిపూజకు ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం లంఘర్‌హౌజ్‌లోని అమ్మవారి ఆలయం లో, చోటా బజార్‌లోని పూజారి నివాసంలో ఉన్న అమ్మవారికి మంత్రులు, అతిథులు ప్రత్యేక పూజలు జరిపి పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్కడి నుంచి చోటా బజార్ మీదుగా బంజారా దర్వాజ వైపు నుంచి గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయానికి అమ్మవారికి అత్యంత ఘనంగా తొట్టెల ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు ఊరేగింపులో సందడి చేశా యి. భక్తులు మట్టి కుండలో పరమాన్నం వండి బోనాలను తయారు చేసుకొని ఆలయానికి తరలి వచ్చారు. దీంతో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మా బైలెల్లినాదో నాయనా.. అంటూ భక్తులు పరవశించిపోయారు. బోనాల ప్రారంభోత్సవంలో మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు ప్రతీక అయిన బోనాల పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సు లు ఉండాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. 

లోయర్ ట్యాంక్‌బండ్‌లో.. 

లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్, డిప్యూటీ మేయర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

21,22 తేదీల్లో సికింద్రాబాద్ బోనాలు.. 

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో ఆదివారం ఘటోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రు లు కొండా సురేఖ,  పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భాగ్యనగరం లో ఆషాఢ మాసం బోనాలను తొలిగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తుండగా, ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో, 28,29 తేదీల్లో పాతబస్తీ లాల్‌దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 22న సికింద్రాబాద్‌లో, 29న లాల్‌దర్వాజలో రంగం కార్యక్రమం ఉంటుంది.