సిరిసిల్ల, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టపతి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ అంబేడ్కర్ పై అమిత్ చ ష చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత దేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశమన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పదే పదే అంబేడ్కర్ అని నిందించడం సరికాదన్నారు. దేశంలో మహిళలకు సమాన హక్కు కల్పించింది రాజ్యాంగమని, అలాంటి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశ ఐక్యతను, భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసేలా అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ప్రధాని మోడీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఖీమ్యా నాయక్ వినతి పత్రం అందజేశారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.