రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప్ పత్ర (పార్టీ మేనిఫెస్టో)ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. రాంచీలో ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, మేము ఈరోజు 'సంకల్ప్ పత్ర'ని విడుదల చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోందని చెప్పారు. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించిన అమిత్ షా ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు.
ఆదివారం జార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న మూడు ర్యాలీలలో ప్రసంగించనున్నారు. షా శనివారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నారు. "కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాంచీలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు. పగటిపూట ఘట్‌శిలా, బర్కథా, సిమారియా అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు ర్యాలీలలో కూడా ప్రసంగిస్తారు" అని బిజెపి తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 4న జార్ఖండ్‌లో పర్యటించి రెండు ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 5న జంషెడ్‌పూర్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నారు.