రాంచీ: జార్ఖండ్‌లో మహిళలకు ప్రతి నెల రూ. 2,100 ఇస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సంకల్ప్ పత్ర (మ్యానిఫెస్టో)ని ఆవిష్కరించిన కేంద్ర అమిత్ షా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల కీలక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడుతూ, జార్ఖండ్‌లో జరిగే ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చడమే కాదు, జార్ఖండ్ భవిష్యత్తును మార్చగలదన్నారు.
జార్ఖండ్‌లో రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి తెస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిపై దృష్టి సారించిన బీజేపీ ప్రభుత్వానికి, అవినీతి, నిర్వహణ లోపంతో అతలాకుతలమైందని ఆయన పేర్కొన్న ప్రభుత్వానికి మధ్య పూర్తి వైరుధ్యాన్ని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర గుర్తింపు, భూమి, మహిళల భద్రతపై రాజీపడే ప్రభుత్వం కావాలా లేక ఈ విలువలను కాపాడే బీజేపీ పరిపాలన కావాలా నిర్ణయించుకోవాలని ఓటర్లకు అమిత్ షా సవాలు విసిరారు.