అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చలో ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనతో పాటు పలు అంశాలపై చర్చించారు. ‘హైందవ శంఖారావం’(Haindava Sankharavam) కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నేతలను అమిత్ షా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ ఉనికిని పెంపొందించేందుకు అంతర్గత విభేదాలను పక్కనబెట్టి పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరాన్ని షా నొక్కిచెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలని నాయకులను అమిత్ షా కోరారు.