calender_icon.png 27 October, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఆమ్జెన్ సెంటర్

10-08-2024 01:15:49 AM

ఈ ఏడాది చివర్లో హైటెక్ సిటీలో ప్రారంభం

  1. 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు 
  2. కంపెనీ ఎండీతో సీఎం రేవంత్ భేటీ
  3. పెట్టుబడులతో వచ్చి భవిష్యత్తును దిద్దుకోండి 
  4. ఐటీ సర్వ్ అలయెన్స్ సమావేశంలో పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయ క్రాంతి): అమెరికాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. హైటెక్‌సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచస్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. 40 ఏండ్లుగా తమ కంపెనీ బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయితో కొత్త ఆవిష్కరణలతో మరింత ఉత్తమ సేవలందించేందుకు ఈ సెంటర్  ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయను నేషనల్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించనున్నట్టు చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆమ్జెన్ నిర్ణయం తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను చాటి చెబుతుందని అన్నారు. ఆమ్జెన్ కంపెనీ వంద దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు. 

తెలంగాణ.. ఫ్యూచర్ స్టేట్

ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని ‘తెలంగాణ ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో టెక్ యూనికార్న్ సీఈవోలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు.

‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి.. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అని పిలుపునిచ్చారు. ‘ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం’ అని సూచించారు. 

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నో ఏళ్లు కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరా బాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు ప్రపంచస్థాయి నాలుగో నరగంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది’ అని స్పష్టం చేశారు. 

టెక్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని కోరారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు.

ఆపిల్ క్యాంపస్‌లో సీఎం బృందం 

కాలిఫోర్నియాలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్కును సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్‌లో ఆపిల్ మాన్యుఫ్యాక్చర్ టీమ్‌తో రేవంత్‌రెడ్డి బృందం భేటీ అయింది. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రదేశమని వారికి సీఎం టీమ్ వివరించింది. 

అడోబ్ సీఈవోతో భేటీ 

సీఎం రేవంత్‌రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో తమ ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్‌ను కలుసుకోవటం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.