calender_icon.png 11 April, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికన్లు మూల్యం చెల్లించుకోక తప్పదు

04-04-2025 12:36:05 AM

సుంకాలపై ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆస్ట్రేలియా దిగుమతులపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం సుంకాలకు ఆ దేశ ప్రజలే భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘ఈ సుంకాలు ఊహించినవే. కానీ, ఇవి పూర్తిగా అసంబద్ధమైనవి.

ఈ అన్యాయమైన సుంకాలకు ఆ దేశ ప్రజలే మూల్యం చెల్లించుకుంటారు. అందుకే మా ప్రభుత్వం పరస్పర సుంకాలను కోరుకోదు. అధిక ధరలు, వృద్ధిని అడ్డుకునే ఈ పోటీలో మేము చేరము’ అని పేర్కొన్నారు. 

టారిఫ్‌లకు వ్యతిరేకంగా పోరాటం

డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లపై పోరాటం చేస్తానని కెనడా ప్రధాని మార్క్ కార్నే ప్రతిజ్ఞ చేశారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ రంగాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు లక్షలాది మంది కెనడియన్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ చర్యలను కౌంటర్ సుంకాలు విధించడం ద్వారా ఎదుర్కోబోతున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ది కెనడా స్టేట్స్ మెక్సికో అగ్రిమెంట్‌కు అనుగుణంగా లేకుండా అమెరికా నుంచి దిగుమతయ్యే అన్ని వాహనాలపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. 

తక్షణమే రద్దు చేయాలి

కొత్త టారిఫ్‌లను అమెరికా తక్షణమే రద్దు చేయాలని చైనా పిలుపునిచ్చింది. కొత్త సుంకాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి హాని కలిగిస్తాయంది. అమెరికా ప్రయోజనాలతోపాటు అంతర్జాతీయ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది.

వాణిజ్య యుద్ధంతో ప్రయోజనం లేదు

వాణిజ్య యుద్ధంతో ఎవరికీ ప్రయోజనం ఉండదని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇదే సమయంలో వాణిజ్య యుద్ధాలు రెండు వైపులా హాని కలిగిస్తాయని జర్మనీ హెచ్చరించింది. 

ఒప్పందానికి సిద్ధం

అమెరికాతో తాము వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్వీడన్ స్పష్టం చేసింది. టారిఫ్‌లపై ట్రంప్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోనున్నట్టు ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఓ ప్రకనటలో వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.