calender_icon.png 14 October, 2024 | 8:13 AM

ఇజ్రాయెల్‌కు అమెరికన్ థాడ్

14-10-2024 03:41:21 AM

ఆపరేట్ చేసేందుకు 3 వేల మంది అగ్రరాజ్య సైనికులు

జెరుసలేం, అక్టోబర్ 13: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌తో దాడి చేయడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. అగ్రరాజ్యం వినియోగించే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ (థాడ్)ను టెల్‌అవీవ్‌కు పంపించనున్నది.

ఈ విషయాన్ని శనివారం రాత్రి యూఎస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థను ఆపరేట్ చేసేందుకు 3 వేల మంది అమెరికన్ సైనికులు ప్రత్యేకంగా టెల్ అవీవ్‌కు వెళ్తున్నారు. ఇరాన్‌పై ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన వేళ అమెరికా అందుకు మద్దతు ఇవ్వడం గమనార్హం.

పశ్చిమాసియాలో తమ పేట్రియాట్ బెటాలియన్ల మోహరింపులను పెంచాలని యూఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. థాడ్ వ్యవస్థకు అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసే శక్తి ఉంటుంది. 2019లో ఇరాన్ సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు చేయడంతో నాడు అమెరికా ఈ వ్యవస్థనే వినియోగించింది.