calender_icon.png 22 February, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాకు అమెరికా నిధులు!

22-02-2025 12:00:00 AM

  1. 21 మిలియన్ నిధులు బంగ్లాకు మళ్లాయని వార్తలు!
  2. వార్తా కథనాలను షేర్ చేస్తున్న కాంగ్రెస్
  3. తప్పుడు వార్తలని కొట్టి పారేస్తున్న బీజేపీ
  4. కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఇస్తూ వచ్చిన 21 మిలియన్ డాలర్ల యూఎస్ నిధుల ఆంశం మరో కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ నిధుల విడుదలకు బ్రేక్ వేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా మరో వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఈ నిధులు బంగ్లాదేశ్‌కు మళ్లాయని ఓ జాతీయ మీడియా కథనం వివరించింది. దీంతో ఈ కథనాన్ని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ‘2008 నుంచి భారత్‌లో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి యూఎస్‌ఎయిడ్ నిధులు అందలేదు.

2022లో 21 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులు బంగ్లాదేశ్‌కు మంజూరు చేయబడ్డాయి. ఈ నిధులతో అక్కడ అమర్ ఓట్ అమర్ (నా ఓటు నాదే) ప్రాజెక్టు చేపట్టారు’. అని ఆ కథనం వివరించింది. 

బీజేపీవి అబద్దాలు

ఈ రిపోర్ట్‌ను చూపుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘బీజేపీ నిజానిజాలు తెలుసుకోకుండా ప్రత్యర్థులపై బురదచల్లుతోంది. ఇది తప్పు అని ఇప్పుడు తెలిసిందిగా.. ఇప్పుడు బీజేపీ క్షమాపణలు చెబుతుందా’ అని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ‘ఒక వేళ 21 మిలియన్ డాలర్ల గ్రాంట్ భారత్‌కు అందితే అది బీజేపీకి పెద్ద వైఫల్యం. అజిత్ ధోవల్, ఐబీ, రా ఎక్కడికి పోయాయి. తర్వాత 2012లో అందాయని చెప్పారు. ఆ డబ్బులతోనే 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా?’ అని ప్రశ్నించారు. జైరాం రమేశ్ కూడా బీజేపీ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 

అది అసత్య ప్రచారం.. తప్పుడు వార్త

ఈ కథనాన్ని బీజేపీ ఖండించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ ‘2012లో భారత ఎలక్షన్ కమిషన్ ఐఎఫ్‌ఈఎస్‌తో ఇందుకు సంబంధించిన ఒప్పందం చేసుకుంది. ఐఎఫ్‌ఈఎస్  జార్జ్ సోరోస్‌తో లింకప్ అయి ఉందనే విషయం తెలిసిందే. సోరోస్‌కు చెందిన సంస్థే యూఎస్‌ఎయిడ్‌కు మొదట నిధులు సమకూర్చింది. 2014 నుంచి వివిధ పనుల కోసం ఇచ్చిన నిధుల విషయంలో కూడా ఆ రిపోర్ట్ ఏమీ చెప్పకపోవడం గమనార్హం. వారు భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు.’ అని అన్నారు. 

కిక్ బ్యాక్ స్కీమ్ అది.. 

భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇచ్చిన 21 మిలియన్ డాలర్ల నిధులపై రగడ ఆగడం లేదు. తాజాగా ట్రంప్ ఇది “కిక్ బ్యాక్ స్కీమ్‌” అని విమర్శించారు. ట్రంప్ అలా వ్యాఖ్యానించగానే.. బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రిపబ్లిక్ పార్టీ గవర్నర్ల సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21 మిలియన్ డాలర్ల నిధులు ఇండియాలో ఓటర్ టర్నౌట్ కోసం ఇవ్వాలట? ఇండియా ఓటర్ టర్నౌట్ గురించి మనమెందుకు పట్టించుకోవాలి.

మన సమస్యలు మనకున్నాయి. ఇదో కిక్ బ్యాక్ స్కీమ్. ఇటువంటి చాలా కేసుల్లో ఏం జరుగుతుందో ఎవరికీ సరిగ్గా అవగాహన ఉండదు. ఇదో కిక్ బ్యాక్ స్కీమ్. నిధులు తీసుకున్న వారు అవి సమకూర్చిన వారికి అనుకూలంగా పని చేస్తారు’. అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీద విరుచుకుపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కేశవన్ 2023లో రాహుల్ గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.