calender_icon.png 7 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా x సౌతాఫ్రికా

19-06-2024 12:10:16 AM

అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ భాగంగా బుధవారం జరగనున్న తొలి పోరులో అమెరికా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. గూప్ దశలో అపజయమే ఎరుగని సౌతాఫ్రికాను అమెరికా ఎలా ఎదుర్కొంటున్నది చూడాలి. లీగ్ దశలో సౌతాఫ్రికా ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. కఠినమైన న్యూయార్క్ పిచ్‌పై మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీలు మరొక మ్యాచ్ కింగ్స్‌టౌన్ వేదికగా ఆడింది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా స్కోరు 120 దాటలేదు.

కానీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఘన విజయాలు అందుకుంది. నోర్టే, రబాడ, షంసీ, కేశవ్ మహరాజ్‌లతో బౌలింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్‌లో పెద్దగా రాణించే అవకాశం రాకపోయినప్పటికీ కెప్టెన్ మార్కరమ్, డికాక్, హెండ్రిక్స్, క్లాసెన్, మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్‌లతో శత్రుదుర్భేద్యంగా ఉంది.  మరోవైపు అమెరికా లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో గ్రూప్ రెండోస్థానంలో నిలిచింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్నప్పటికీ ఆ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం నిజంగా అద్భుతమే. జట్టులో ఎక్కువగా భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉండడం కూడా వారికి కలిసొచ్చింది.

అయితే విండీస్ గడ్డపై తొలిసారి మ్యాచ్ ఆడనుండడంతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్‌లో ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్, ఆల్‌రౌండర్ కోరే అండర్సన్‌లు కీలకం కానున్నారు. బౌలర్లలో సౌరబ్ నేత్రావల్కర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. హర్మీత్ సింగ్, అలీ ఖాన్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. సౌతాఫ్రికా జట్టులో అంతా హిట్టర్లే ఉండడం.. బలమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉండడంతో వారి ని నిలువరించడం అమెరికాకు కష్టమే. అయితే నాకౌట్ అనగానే తీవ్ర ఒత్తిడికి లోనయ్యే సౌతాఫ్రికా బలహీనతను పసిగట్టి ప్రదర్శన చేస్తే మాత్రం మరో సంచలనం తప్పదు.