22-04-2025 01:32:13 AM
బీజేపీ రాష్ట్ర నేత ప్రొఫెసర్ సీతారాం నాయక్
హనుమకొండ, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): వక్స్ చట్టానికి సవరణ చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మా రావు, డాక్టర్ టి. రాజేశ్వర్ రావు, వన్నాల శ్రీరాములు అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోవారు మాట్లాడారు.
కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం వక్స్ చట్టానికి సవరణ చేయాలని సంకల్పించిం దని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిల్లును చట్ట సభలో ప్రవేశ పెట్టడంతో ఉభయ సభల్లో బిల్లు పాసైందని తెలిపారు. వక్స్ చట్టంపై సవరణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండ చౌరస్తా ప్రాంతంలోని విజయ థియేటర్ వద్దగల ఎస్‌ఎస్పీ ఫంక్షన్ హాల్లో వక్స్ చట్టం అంటే ఏమిటి అనే అంశంపై గోపాల్ రావు స్మారక సమితి ప్రజ్ఞాభారతి - వరంగల్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ సదస్సులో ముఖ్యవక్తలుగా సీబీఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వీ వీ లక్ష్మినారాయణ, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గోపాల్ రావు రాకూర్ స్మారక సమితి ప్రజ్ఞాభారతి - వరంగల్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ సమ్మిరెడ్డి, కో కన్వీనర్లు బూర రాంచందర్, ప్రజ్ఞ భారతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రభాకరరావు, బీజేపీ సీనియర్ నేత వీనం రమణారెడ్డి టి. కిషన్ రావు, జీనుగు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.