- విధుల్లో 35 వేల మంది బీఎల్‌ఓలు
- ఆధార్ లింక్‌తో బోగస్ ఓట్ల తొలగింపు
- కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
- 3.33 లక్షల మంది ఓటర్లుగా నమోదు
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2024 ఆగస్టు 20 నుంచి ప్రారంభమైందని, అక్టోబర్ 18 వరకు కొనసాగుతుదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు, 2025 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ఆయన తెలిపారు. బీఆర్‌కే భవన్‌లోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో గురువారం ఎన్నికల బ్రోచర్‌ను సుదర్శన్‌రెడ్డి విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. ఓటరు నమోదుకు ఏడాదిలో నాలుగుసార్లు అంటే జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 అర్హత తేదీలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 3.33 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
35,350 పోలింగ్ కేంద్రాలు..
రాష్ట్రంలో 35,350 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఇందులో 32,385 ప్రభుత్వ పాఠశాలలు కాగా, మరో 2,965 ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయని సీఈవో తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా దాదాపు 90 శాతం వరకు గ్రౌండ్ ప్లోర్‌లోనే ఉన్నాయని, 10 శాతం మాత్రమే మొదటి అంతస్తుల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 119 మంది ఈఆర్‌లోను ఉంటారని, వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల మంది బూత్‌లెవల్ ఆఫీసర్లు ( బీఎల్‌వోలు) పని చేస్తున్నారని, ఈ బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఓట్ల నమోదు సవరణలు చేస్తున్నట్లు తెలిపారు తెలిపారు. అక్టోబర్ 28 వరకు ఓటర్ల జాబితా వెరిఫికేషన్ పూర్తవుతుందన్నారు.
ఓటర్ల జాబితాలో ఫోటోలు, చిరునామా తప్పులు ఉంటే సవరించుకునేందుకు అధికారులు సహకరిస్తా రని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోగస్ ఓట్ల తొలగింపునకు ఓటర్ల సవరణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఓటర్ కార్డులు ఉంటున్నాయని, ఆధార్ లింక్‌తో అసలైన ఓటర్ల లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ కార్దుకి ఆధార్ కార్డ్ లింక్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని సీఈఓ తెలిపారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జరుగుతుందని, వాటిని రాజకీయ పార్టీలకు అందజేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి ఈవీఎంల వెరిఫికేషన్ కోరారని, వెరిఫికేషన్ చేసి రిపోర్టు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో ఓటు వేసిన ఓటర్లకు.. వాళ్ల పశువులకి ప్రీ చెకప్‌లతో పాటు అనేక కార్యక్రమాలు చేశారని తెలిపారు.