calender_icon.png 8 October, 2024 | 7:56 AM

వైద్యశాస్త్రంలో ఆంబ్రోస్, గ్యారీకి నోబెల్

08-10-2024 01:47:23 AM

  1. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు క్రమబద్ధీకరణపై పరిశోధనలకు గాను పురస్కారం
  2. ఎంపిక చేసిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రో స్, గ్యారీ రవ్‌కున్‌కు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జన్యు క్రమబద్ధీకరణలో దాని పాత్రను కనుగొన్నందుకు వీరిద్దరికి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా సంస్థలోని 50 మందితో కూడిన నోబెల్ బృందం ఈ అవార్డులను ప్రకటించింది. మానవ కణాల్లో కీలమైన జన్యు కార్యకలాపాలను నియంత్రించే యంత్రాంగంపై వీరి పరిశోధన దృష్టిసారించింది. జన్యు సమాచారం డీఎన్‌ఏ నుంచి ఎంఆర్‌ఎన్‌ఏకు ట్రాన్స్‌క్రిప్షన్ ప్రక్రియ ద్వారా ప్రవహిస్తుంది.

ఆపే ప్రోటీన్ ఉత్పత్తి కోసం కణాల యంత్రాంగానికి చేరుతుంది. అక్కడ ఎంఆర్‌ఎన్‌ఏ విశ్లేషణ జరుగుతుంది. తద్వారా డీఎన్‌ఏలో నిల్వ ఉన్న జన్యు సూచనల ప్రకారం ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రక్రియను ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు అని నోబెల్ బృందం తెలిపింది. 

అక్టోబర్ 14 వరకు విజేతల ప్రకటన

ఏటా కరోలిన్‌స్కా విద్యాసంస్థలోని 50 సభ్యులు గల నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటిస్తుంది. గతేడాది కొవిడ్ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా అభివృద్ధి చేసినందుకు హంగేరీ అమెరికన్ కాటలిన్ కరికో, అమెరికా శాస్త్రవేత్త డ్రూవెయిస్‌మన్‌ను నోబెల్ వరించింది. వైద్యశాస్త్రంలో ఇప్పటివరకు 114 సార్లు పురస్కారాలను ప్రకటించగా 227 మంది అందుకున్నారు. వీరిలో 13 మంది మహిళలు ఉన్నారు.

నోబెల్ బహుమతుల ప్రకటన వైద్యరంగంతో మొదలై అక్టోబర్ 14 వరకు కొనసాగుతుంది. వరుసగా మంగళవారం భౌతిక, బుధవారం రసాయన, గురువారం సాహిత్య విభాగాల్లో  విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం అత్యంత ప్రధానమైన నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

డైనమై ట్ కనిపెట్టిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట ప్రపంచంలో వివిధ రం గాల్లో విశేష కృషి చేసినవారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1896లో నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను అందజేస్తారు. పురస్కార గ్రహీతలకు 10 లక్షల డాలర్ల నగదు అందుతుంది. ఏటా డిసెంబర్ 10న పురస్కారాలను నార్వేలో విజేతలకు అందజేస్తారు.   

గ్రహీతలు వీరే..

విక్టర్ ఆంబ్రోస్: అమెరికాలోని హాంప్‌షైర్‌లోని హనోవర్‌లో 1953లో జన్మించారు. 1973లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పొంది 1985 వరకు పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా కొనసాగారు. తర్వాత హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రధాన ఇన్వెస్టిగేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1992 మధ్య కాలంలో డార్ట్‌మౌత్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం వోర్సెస్టర్‌లోని మసాచుసెట్స్ వైద్య కళాశాలలో సిల్వర్‌మ్యాన్ ప్రొఫెసర్ ఆఫ్ నేచురల్ సైన్స్‌లో పనిచేస్తున్నారు. 

గ్యారీ రవ్‌కున్: 1952లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బర్కిలీలో జన్మించారు. 1982లో హార్వార్డ్ వర్సిటీ నుంచి హీహెచ్‌డీ పొందారు. 1982 మధ్య ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా, తర్వాత మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి, హార్వార్డ్ వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పడు అక్కడే జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.