- దశాబ్దాలుగా వారిదే ఇష్టారాజ్యం
- డమ్మీలుగా మారామని చైర్మన్ల ఆవేదన
- బదీలీలపై దృష్టి సారించని టెస్కాబ్
- ఎన్నడూ జరగని డీఎల్‌ఈసీ బేటీలు
కామారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రాథమిక సహకార సంఘాల్లో దశబ్దాలుగా సీఈవోలు తిష్ట వేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది సీఈవోలు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ విరమణ పొందేవరకు ఒకేచోట పని చేశారు. సహకార సంఘాల్లో దశాబ్దలుగా తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలు లేకపోవడంతో తమకు ఎలాంటి సహకారం అందించడంలేదని చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా పీఏసీఎస్‌ల సీఈవోల బదిలీలు జరగడం లేదు. కామారెడ్డి జిల్లాలో 55 ప్రాథమిక సహకార సంఘాల్లో 55 మంది సీఈవోలు ఉన్నారు. ఇటీవల మూడు సహకార సంఘాల్లో వారి ఇష్టానుసారంగా బదిలీలు చేసుకున్నట్లు సమాచారం.
15 నుంచి 30 ఏళ్లుగా ఒకే చోట..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 110 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. చాలా సొసైటీల్లో 15 నుంచి 30 ఏళ్లుగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చైర్మన్లను సైతం లెక్క చేయడం లేదు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 107 ఏళ్ల చరిత్ర ఉంది. పలు చోట్ల సీఈవోలే పెత్తనం సాగి స్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని సహకార సంఘాల్లో చైర్మన్లు చెప్పినట్టు వినకపోతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఈవోలు ఆరోపిస్తు న్నారు. సొసైటీ చైర్మన్ పదవీ కాలం ఐదేళ్లే.. సీఈవోలు మాత్రం విరమణ వరకు ఒకేచోట పనిచేస్తున్నారు.
దీంతో చాలా సొసై టీల్లో చైర్మన్లకు, సీఈవోలకు పొసగడం లేదు. దీంతో సొసైటీల ప్రతిష్ఠ దెబ్బతింటున్ని. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్, బాన్సువాడ దేశాయిపేట్, మాచారెడ్డి పీఏసీఎస్‌లలో చైర్మన్, సీఈవోల మధ్య బేదాభిప్రాయాలు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. నాలుగేళ్లుగా డీసీసీబీ రూ.2,200కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతుండగా పీఏసీఎస్‌లు చైర్మన్, సీఈవోల మధ్య కోల్డ్‌వార్‌తో తిరోగమన దిశగా పయనిస్తున్నాయి.
డీఎల్‌ఈఎస్ బేటీలు కరువు
పీఏసీఎస్ చైర్మన్లు, సీఈవోలకు మధ్య వివాదాలు చేటు చేసుకుంటున్నా డిస్ట్రిక్ లెవల్ ఎంపార్డ్ కమిటీ (డీఎల్‌ఈఎస్) ఎన్నడూ బేటీ కాలేదు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌తో పాటు సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. సొసైటీల్లో చైర్మన్లు, సీఈవోల మధ్య ఇబ్బందులు తలెత్తినప్పుడు సమన్వయపర్చడం, అవసరమైతే సీఈవోలను ఇతర సొసైటీలకు బదిలీ చేసేందుకు టెస్కాబ్ సిఫారసు చేయడం ఈ కమిటీ విధి. కానీ ఎప్పుడూ కూడీ ఈ కమిటీ సమావేశాలు నిర్వహించలేదు.
సీఈవోలతో రైతులకు ఇబ్బందులు
చాలా సొసైటీల్లో చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు చేసిన తీర్మానాలను సీఈవోలు బుట్టుదాఖలు చేస్తున్నారు. చైర్మన్లు చెప్పిన రైతులకు రుణాలు ఇచ్చే విషయాన్ని పట్టించుకోకుండా వారిని సొసైటీల చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీఇవోల బదీలీల విషయంలో టెస్కాబ్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా పీఏసీఎస్‌లలో సమస్యలు జఠిలంగా మారుతున్నాయి.
బదిలీలు జరపని టెస్కాబ్
హైదారాబాద్‌లోని టెస్కాబ్ అధికారులు డీసీసీబీ, పీఏసీఎస్‌లలో బదీలీల ప్రక్రియ చేపడుతుంది. సహకార బ్యాంకుల్లో ఉద్యోగులు,అధికారుల వరకు బదీలీలు చేస్తున్నా సొసైటీ సీఈవోల బదీలీలపై దృష్టి సారించడం లేదు. కొన్ని రోజుల క్రితం కొన్ని సొసైటీల్లో పాలకవర్గాలు సీఈవోలను తొలగించాలని తీర్మానాలు చేసి డీసీఈవీలతో పాటు టెస్కాబ్‌కు తీర్మానాలు పంపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
టెస్కాబ్ నిర్ణయంతోనే బదీలీలు
దీర్ఘకాలికంగా సొసైటీల్లో పని చేస్తున్న సీఈవోల బదీలీలపై టెస్కాబ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టెస్కాబ్ నుంచి బదిలీల ఉత్తర్వులు వస్తేనే ఆ ప్రక్రియను నిర్వహిస్తాం. బదిలీల ప్రక్రియ మా పరిధిలో లేదు. రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు వస్తేనే బదీలీలు ఉంటాయి.
-శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి డీసీవో, కామారెడ్డి