calender_icon.png 26 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి అంబర్-రెసోజెట్ కంపెనీ

26-11-2024 02:15:50 AM

  1. రూ.250 కోట్లతో ఉత్పాదన ప్లాంట్ల ఏర్పాటు
  2. వెయ్యి మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్-రెసోజెట్’ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండీషనర్ల వంటి పలు పరికరాలను ఉత్పత్తి చేసి అందజేస్తోందని తెలిపారు.

వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

వందేభారత్ రైళ్లు, మెట్రో రైళ్ల ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలతోపాటు బస్సులు, డిఫెన్స్ వాహనాల, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండీషనర్ల తయారీలో అంబర్ ఎంటర్‌ప్రైజెస్‌కు మంచి పేరుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, టీజీఐఐసీ ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్, ఎస్‌కేశర్మ, అంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.