* ఆయన స్ఫూర్తితోనే దళితబంధు అమలు
* బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అనితర సాధ్యమైనవని బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం స్వయంపాలన కోసం ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సాంస్కృతిక రంగాల్లో అణగారిన వర్గాల కు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో ఆయన కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేశారు.
వారి విశేష కృషి, స్ఫూర్తిని చాటేందుకు రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామ న్నారు. ఆయన ఘన కీర్తిని చాటేందుకు తెలంగాణ పాలనా భవనానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో వివక్ష లేని సమసమాజ నిర్మాణానికి కృషి చేయడమే అంబేద్కర్‌కు మనమిచ్చే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.