14-04-2025 11:17:06 AM
మునిపల్లి: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగానే మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ కొనియాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీనవర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.