calender_icon.png 16 April, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ మేధావి అంబేద్కర్

14-04-2025 05:40:25 PM

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే.. 

జుక్కల్ (విజయక్రాంతి): డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ రామ్ జీ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. అన్నిటికంటే విద్య గొప్పదని రుజువు చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాజ్యాంగం లో రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణకు రాష్ట్రం ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. అప్పటి కాలంలో రాజ్యాంగంలో పొందుపరచకుంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడేవి కావని అన్నారు. మహిళలకు, బిసి, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని పార్లమెంటులో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిమాండ్ చేయగా దానిని తిరస్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆయన ఆసహనం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈరోజు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బతుకుతున్నాడు అంటే ఆయన రాజ్యంలో పొందుపరిచిన హక్కులే కారణమని పేర్కొన్నారు.

అన్ని దేశాలలో కన్నా భారతదేశానికి ఉన్నతమైన రాజ్యాంగం రచించి ప్రజలకు బహుమతిగా అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు ఎన్ని కొనియాడిన తక్కువేనని అన్నారు. ఆయన చదువుకున్న సదువులు ఇప్పటివరకు కూడా ఎవరు చదవలేదని పేర్కొన్నారు. దళితుల కోసం దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి పత్రికలు స్థాపించి వాటి ద్వారా ప్రజలకు చైతన్య పరిచిన మహోన్నతమైన వ్యక్తిగా అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా ఎన్నో పోరాటాలు చేసినా ఘనత ఆయనకే దక్కిందన్నారు. తుది శ్వాస విడిచేంతవరకు ఆయన జీవితం కంటే దేశ పౌరుల జీవితాలే ముఖ్యమని భావించి బతికారని అందరం ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం సువర్ణ భారత్ గా మారుతుందని పేర్కొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

దళితులకు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు కాకుండా అందరికీ మోసం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం దళితులపై గౌరవం ఉన్న దళిత బంధు స్థానంలో వారు ఇస్తానన్న పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే తో పాటు నాయకులు నీలు పటేల్, రమేష్, కిరణ్ కాంబ్ళే, అస్పత్ వార్ వినోద్, ఇమ్రాన్,  అజయ్, సురేష్ గొండ, గంగారాం చర్ల తదితరులు పాల్గొన్నారు.