పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరగడం బాధకరంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆవేద న వ్యక్తం చేశారు. పంజాగుట్ట సెంటర్‌లో ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు అడ్డుకుని గోషామహాల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని, ఆ విగ్రహాన్ని తనకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినా ఇప్పటివరకు తనకు ఇవ్వలేదన్నారు.
శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్‌యాదవ్, రవళిరెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు.
అంబేద్కర్ జయంతి వరకు ఆయన విగ్రహాన్ని పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో పెట్టాలని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆలోచనలకు ఎంఐఎం కూడా వ్యతిరేకం కాదని, అందుకు పాతబస్తీలో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
2019లో పంజాగుట్ట సర్కిల్‌లో జై భీమ్ కార్యకర్తలు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూలగొట్టి జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో పడేశారని తెలిపారు. ఆ సమయంలో తన సొంత డబ్బులతో విగ్రహం ఏర్పాటు చేయించి పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు తీసుకెళ్లితే పోలీసులు అడ్డుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని, గత ఐదేళ్లుగా అక్కడనే ఉందని ఆయన పేర్కొన్నారు.