లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి, పట్టణంలో రోడ్డు వెడల్పు చేసి మధ్యలో డివైడర్ నిర్మించాలని గురువారం వారసంతను వేరే చోటికి తరలించాలని, పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను మున్సిపాలిటీ వారు వెంటనే పరిష్కరించాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి ఇటిక్యాల వరకు నాలుగు వరుసల రహదారి నిర్మించాలన్నారు. ఉత్కూర్ లో గురువారం నిర్వహిస్తున్న వారసంత వేరే చోటికి తరలించాలన్నారు.
అంబేద్కర్ చౌరస్తా నుండి గోదావరి వరకు ఆక్రమించిన షాపులు తొలగించి, రోడ్డు వెడల్పు చేయాలని, అంబేద్కర్ చౌరస్తా (ఉత్కూర్) కరీంనగర్ చౌరస్తా (ఎన్టీఆర్ చౌక్)లను డెవలప్ చేయాలన్నారు. అక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాపాడాలన్నారు. పట్టణంలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ రకాల పింఛన్లు మంజూరు చేయాలన్నారు. పట్టణంలోని సిలువ గుట్ట, కాకుల గుట్టలను రక్షించాలని, లక్షెట్టిపేట పట్టణానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలన్నారు. గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ లలో ప్రయాణికులకు బస్ షెల్టర్ లను నిర్మించాలని, ఉత్కూర్ చౌరస్తా, గాంధీ చౌక్ లలో గల సులబ్ కాంప్లెక్స్ లను వెంటనే తెరిపించాలని కోరారు. మంగలి కుంట, బోట్ల కుంట, ఇటిక్యాల, గంపలపల్లి చెరువులతో పాటు చిన్న చిన్న కుంటలు కబ్జాకు గురికాకుండా పెన్సింగ్ వేసి రక్షించాలన్నారు.
గతంలో గోదావరిపై ప్రారంభించిన బోటింగ్ ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి రోజు అందేలా చూడాలని, ప్రతి వారం దోమల మందు ప్రతి వార్డులో పిచికారీ చేయాలని, ఊర పందులను ఊరికి దూరంగా తరలించాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్, క్రీడా మైదానాలను, సంరక్షించాలన్నారు. పట్టణంలో నానాటికి పెరిగిపోతున్న కుక్కలు, కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి వాటి పెరుగుదలను అరికట్టాలన్నారు. ఇటిక్యాల నుండి మర్రిపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, పట్టణంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ పాలకవర్గం తీర్మానించి, పగడ్బందిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి పరిసరాల్లో చెత్త చెదారం వేయకుండా చర్యలు చేపట్టాలని, ప్రతిరోజు ప్రజా సమస్యలపై వివిధ దినపత్రికల్లో వార్తలు వచ్చిన మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకొని పరిష్కరించాలన్నారు.
వెంటనే పై సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కళ్లేపల్లి విక్రమ్, కండె మొగిలి, చుంచు రమేష్, గుత్తికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, జక్కుల రాయాలింగు, పెండెం సత్తన్న, వేల్పుల ప్రేమ్ సాగర్, మినుముల శాంతికుమార్, కళ్యాణం రవి, బన్న శ్రీనివాస్, అడ్లూరి శివకుమార్, పెండెం రాజశేఖర్, క్రాంతికుమార్, న్యాతరీ చిన్నయ్య, సభ్యులు పాల్గొన్నారు.