కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్
న్యూఢిల్లీ, నవంబర్ 25: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వ్యతిరేకించారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అన్నారు. ‘విద్యార్థుల కోసం భారత రాజ్యాంగం’ పేరుతో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిషత్తు ముందుకు వచ్చిన అనేక అంశాలపై మొదట అంబేడ్కర్ మాట్లాడేవారని, వాటిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగేవని చెప్పారు. సభ్యులు లేవనెత్తిన అనేక అనుమానాలను అంబేడ్కర్ నివృత్తి చేసేవారని తెలిపారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారని, దేశ ఐక్యత, సమగ్రతకు ఈ ఆర్టికల్ విరుద్ధమని అంబేడ్కర్ భావించారని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఆర్టికల్‌ను ఆమోదించాలని అంబేడ్కర్‌పై నెహ్రూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని,, అయినా ఆయన తిరస్కరించడంతో అంబేడ్కర్ లేని సమయంలో దీన్ని ఆమోదించినట్లు చెప్పారు.