14-04-2025 06:17:05 PM
మణుగూరు (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ త్రికరణ శుద్ధితో పనిచేస్తుందని, భారతదేశంలో అనేక వర్గాల ప్రజల అభ్యున్నతికి అత్యంత పదునైన ఆయుధం మన రాజ్యాంగం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మణుగూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రాజకీయ, సామాజిక,ఆర్థిక రంగాలలో బలమైన మార్పులకు మన రాజ్యాంగమే స్ఫూర్తి అన్నారు. యావత్ ప్రపంచం మెచ్చుకునే విధంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జై భీమ్ నినాదంతో అంబేద్కర్ ఆశయాలను వారు అనుసరించిన మార్గాలను భావితరాలకు అందించే విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పి నాని ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, ఆవుల సర్వేశ్వరరావు, బూర్గుల నరసయ్య, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.