14-04-2025 08:00:00 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు కోర్ట్ ఏరియాలో గల బీసీ బాలుర వసతి గృహంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 134 వ జయంతిని పునస్కరించుకొని ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ... అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని సమాజంలో అన్ని వర్గాల హక్కుల, స్వేచ్ఛ, సమైక్యత కోసం వారు కృషి చేశారని, అట్టడుగు వర్గాల, అభ్యున్నతికి తోడ్పాటు అందించారన్నారు.
అంతేకాకుండా పేదల జీవితాల్లో వెలుగు నింపాలని పరితపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు, మనమందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, ముఖ్యంగా విద్యార్థులు అంబేద్కర్ గారి జీవిత చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను నెరవేర్చే విధంగా కృషి చేయడమే వారికి మనమీచ్చే నిజమైన నివాళులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, హాస్టల్ వార్డెన్ కే రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.