15-04-2025 01:43:01 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 14 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని వాడవాడలా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు దళిత సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్ పట్టణంలతో పాటు పెంట్లవెల్లి మండలం, జటప్రోలు, చిన్నంబావి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయా పట్టణ ప్రధాన కూడళ్ళ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎఎస్పీ రామేశ్వర్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షతన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరయారు. వంగూరు మండల్ గుంటూరు గ్రామంలో మాజీ ఎంపీ పోతుగంటి రాములు నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనగారిన వర్గాల వారికి అంబేద్కర్ ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు.
వనపర్తిలో
వనపర్తి, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ) : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు. భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ కూడలి లోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర స్పోరట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.సి.సి.బి. చైర్మన్ మా మిళ్ళ పల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, ఇతర సంఘ నాయకులు, జిల్లా వ్యాప్తంగా ఆయా మండ లం లో ఆయా సంఘాల నాయకులు వేరువేరుగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాల కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని, బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే అంబేడ్కర్ ఆశయ సాధన అని గుర్తు చేశారు.
బి.ఆర్ అంబేడ్కర్ మహనీయుడనీ, వంద సంవత్సరాల క్రితమే భారత దేశం ఎలా ఉండాలి, చట్టాలు ఏ విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కొనియాడారు. వనపర్తి పట్టణంలోని నల్ల చెరువుకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ ప్రతి ఒక్కడికి దేవుడు ..... రాష్ట్ర స్పోరట్స్ అధారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి
అంబేడ్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో దేవుడు కాదని, ప్రతి ఒక్కడికి దేవుడని రాష్ట్ర స్పోరట్స్ అధారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి కొనియాడారు. ప్రతి పేదవారికి న్యాయం జరగాలని, సమాన హక్కులు కల్పించా లని అంబేడ్కర్ కలలు కన్నాడని అన్నారు. అందుకే ప్రతి ఇంటికి అంబేడ్కర్ ఆశయాలను తీసుకువెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.సి.సి.బి చైర్మన్ మామిళ్ళ పల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం గట్టయ్య, ఉపాధ్యక్షుడు భోజరాజు, ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లికార్జున, ము న్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్, కుల సంఘాల నాయకులు గంధం నాగరాజు, కిరణ్ కుమార్, బోయ వెంకటేష్, రాజారాం, కేశ వులు, మహేష్, అక్కమ్మ, నాగరాజు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం;----- ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి.
నారాయణపేట. ఏప్రిల్ 14(విజయక్రాంతి): భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూ డు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు.
సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సం దర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో అంబేద్కర్ చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో భా గంగా కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు దంపతులకు ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, సంచిత్ గ్యాంగ్వర్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ కొనoగేరి హనుమంతు, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీ ఐ శివ శంకర్, దామర గిద్ద విండో చైర్మన్ ఈదప్ప, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమా పతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్‌ఓ ఎం. ఏ. రషీద్,జాన్ సుధాకర్, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణు గోపాల్, సరాఫ్ నాగరాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సలీం, మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు శరణప్ప, సూర్యకాంత్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు సోమవారం గద్వాల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నవభారత నిర్మాణంలో డా.బి.ఆర్.అంబేద్కర్ పోషించిన పా త్ర విశేషమైందన్నారు. సమాజంలో అంటరానితనం, బానిసత్వం, అస్పృశ్యతల నిర్మూలనకు, వివక్ష పై అలుపెరుగని పోరాటం చేసి, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు.
అందరూ సమానంగా, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు, రిజర్వేషన్లు, అన్ని వెనుకబడిన వర్గాలకు సమానత్వం రావడానికి ముఖ్య కారణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాటమే అని కలెక్టర్ అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ధి, సమాజ మార్పు, సమానత్వం సాధించడంలో కీలకమైన సాధనమని విశ్వసించి, వారి ఇచ్చిన విద్య ప్రాముఖ్యతను మనం కూడా అనుసరించి, సమాజంలో అభివృద్ధి సాధించడంలో భాగస్వామ్యం కావాల ని అన్నారు.
అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణం లో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనిఅంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఏఓ నరేందర్, జిల్లా బి. సి.సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు,ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వాడవాడలా అంబేద్కర్ జయంతి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 14 (విజయ క్రాంతి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, టి ఆర్‌ఎస్, కాంగ్రెస్, తోపాటు వివిధ పార్టీలు, టీజీవో సంఘం అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్, సిఐటియు రాష్ట్ర నాయ కులు కిలే గోపాల్, బి సి పి ఏ కృష్ణుడు తో పాటు వి విధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దాం అని పిలుపునిచ్చారు.