calender_icon.png 15 April, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ త్యాగం మరువలేనిది

14-04-2025 11:14:14 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం మరువలేనిదని ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా రామగిరి మహేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం కలిగిన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అంబేద్కర్ పోరాటం చేశారని అన్నారు.

ఇందుకోసమే అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజిక సమానత్వానికి మార్గం విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మిన అంబేద్కర్ జీవిత చరిత్రను నేటి యువత గమనించాలని సూచించారు. మాల మాదిగ వాడలలో మాత్రమే అంబేద్కర్ విగ్రహాలను పరిమితం చేసి ఆయన త్యాగాన్ని రాజకీయ వ్యవస్థ అవమానిస్తుందని ఆరోపించారు. కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల, అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల కోసం ఓటు హక్కును కల్పించి రాజకీయ, సామాజిక రంగాల్లో సమానత్వాన్ని కల్పించిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో దళితులు స్వేచ్ఛగా గుర్తింపు పొందుతున్నారంటే అంబేద్కర్ తో పాటు మహనీయుల త్యాగ ఫలితం మాత్రమేనని అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.