calender_icon.png 25 September, 2024 | 5:58 AM

ముప్పు అంచున అమెజాన్

25-09-2024 04:02:04 AM

  1. అతిపెద్ద అడవుల్లో కొనసాగుతోన్న విధ్వంసం
  2. మైనింగ్, వ్యవసాయం పేరుతో తగ్గుతోన్న విస్తీర్ణం
  3. 12.5 శాతం మేర క్షీణించిన ఫారెస్ట్
  4. ఇది జర్మనీ, ఫ్రాన్స్‌ల భూభాగానికి సమానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ గత నాలుగు దశాబ్దాల్లో దాదాపు జర్మనీ, ఫ్రాన్స్ దేశాల పరిమాణంలో అటవీ విస్తీర్ణాన్ని  కోల్పోయిందని ప్రఖ్యాత సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది.

దక్షిణ అమెరికా ఖం డంలోని 9 దేశాలలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులు గ్లోబల్ వార్మింగ్, వాతా వరణ మార్పులను నివారించడంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎటు వంటి సందేహం లేదు. భూమికి అమెజాన్ అడవులు ఊపిరితిత్తుల్లా వ్యవహరిస్తాయని పేరుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌లో 20 శాతం అమెజాన్ నుంచే వస్తుంది.

ప్రపంచంలో ఎక్కడా కన్పించని వృక్ష, జంతు సంపద అమెజాన్ సొంతం. ఒకప్పుడు దట్టమైన అడవులతో ఉన్న భూ ములు ఇప్పుడు మైనింగ్, పరిమితికి మించి వ్యవసాయం, కలప స్మగ్లింగ్ తదితర కారణాలతో క్షీణిస్తోంది.

ఇప్పటివరకు దాదాపు 12.5 శాతం మేర అమెజాన్ అటవీ విస్తీర్ణం నాశనమైందని సమాచారం. అటవీ సంపద ను నరికివేయడం వలన పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచ దేశాలపై ప్రభావం..

అమెజాన్ అటవీ సంపదను కోల్పోవడంతో యూఎస్‌ఏతో పాటు ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఆక్సిజన్‌లో 20శాతం అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుందని, ఇంతటి ప్రాముఖ్యం గల అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చే చెట్లు తక్కువైపోవడంతో పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలగడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మానవ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామన్ గుడ్ నుంచి సాండ్రా రియో కాసెరెస్ మెరూవియన్ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేషన్ తన పరిశోధనలో తెలిపింది.

శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడంతో పాటు మైనింగ్, పరిమితికి మించి వ్యవసాయం, వృక్షాల నరికివేత తగ్గించడంతో పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడితే తప్ప ఈ విపత్తు నుంచి బయటపడే అవకాశం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విధ్వంసానికి కారణమేంటి?

అమెజాన్ అడవుల విధ్వంసానికి మైనింగ్, వ్యవసాయం, స్మగ్లింగ్ వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. గత 40 ఏళ్ల గణాంకాలను పరశీలిస్తే.. అమెజాన్ అడవుల్లోని మెత్తంలో 12.5 శాతం మేర అడవులు కనుమరుగయ్యాయని పలు స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో తేలింది. దాదా పు 88 మిలియన్ హెక్టార్లలో అటవీప్రాం తం నాశనమైందని తేలింది. బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజువెలా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానాలో అమెజాన్ అటవీ సంపద పెద్ద ఎత్తున ధ్వంసమైంది. 

మరీ ముఖ్యంగా బ్రెజిల్ నిర్లక్ష్యం కారణంగా అమెజాన్ అటవీ సంపద ఎక్కువగా ధ్వంసం అయ్యిందని సర్వేలు నొక్కి చెప్పాయి. అభివృద్ధి పేరుతో అమెజాన్‌ను బ్రెజిల్ తగలబెడుతోందని ఎప్పటినుంచో వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. బ్రెజిల్‌లోనే అమెజాన్ అడవికి తీవ్రంగా నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.